వలస నేతలపై తెలంగాణ కాంగ్రెస్ లో కుమ్ములాటలు

ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఇతర పార్టీల నుండి నేతలను ఆకర్షిస్తూ, వారికి పార్టీలో ప్రాధాన్యత ఇస్తూ ఉండడం పట్ల తెలంగాణ కాంగ్రెస్ లో సరికొత్త కుమ్ములాటలు ప్రారంభం అవుతున్నాయి. మొదటినుండి పార్టీకోసం పనిచేస్తున్న  ఈ సందర్భంగా నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. వేరే పార్టీల నుంచి వస్తేనే ప్రాధాన్యత ఇస్తారా? లేకుండా అస్సలు పట్టించుకోరా? అంటూ చిందులు వేస్తున్నారు.
ముఖ్యంగా పార్టీలో సీనియర్ నేతగా ఉన్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అసమ్మతి స్వరం వినిపించడం పార్టీ వర్గాలలో కలకలం రేపుతోంది.  ఎప్పుడూ అధికార పార్టీపై నిప్పులు చెరుగుతూ, ప్రతీ విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ గొంతుకై వినిపించే పొన్న ప్రభాకర్ ఇప్పుడు ఇలా పార్టీ నాయకత్వంపై ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. మొన్న ఏఐసీసీ ప్రకటించిన ఎన్నికల కమిటీలో ఇటీవల పార్టీలో చేరిన వారి పేర్లుండటం, తనకు ప్రాతినిధ్యం లేకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అధిష్ఠానాన్ని కలిసి తాడో పేడో తేల్చుకొనేందుకు ఆదివారం పొన్నం వర్గీయులు హైదరాబాద్‌ వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తోంది. పార్టీలో తన గొంతున గట్టిగా వినిపిస్తూ బలమైన నేతగా పేరు తెచ్చుకున్న పొన్నంకు ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా  ఇవ్వడం లేదని రగిలిపోతున్నారు.

పార్టీలో ఎన్.ఎస్.యు.ఐ స్థాయి నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన పొన్నం ప్రభాకర్ కు సుముచిత స్థానం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పొన్నంపై కొందరు సీనియర్ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్‌లో ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమనేత పొన్నంను కాంగ్రెస్‌ ఎలా మరిచిపోయిందని మండిపడ్డారు. 

ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు ఇస్తున్న ప్రాధాన్యత ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడిన వారికి లేదా? ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నం ప్రభాకర్ కు కమిటీలో స్థానం కల్పించకపోవడంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ ఎన్నికల కమిటీలో అవసరమైతే తన పేరు పక్కన పెట్టి పొన్నం ప్రభాకర్ కు స్థానం కల్పించాలని చెప్పారు.

గాంధీ భవన్ వద్ద పొన్నం ప్రభాకర్ అనుచరులు ఆందోళనకు దిగారు. పార్టీ కోసం నిజాయితీగా పనిచేస్తున్న తనపై అధిష్టానం చిన్నచూపు చూస్తుందని సన్నిహితులు, కార్యకర్తల వద్ద పొన్నం ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీలో పొన్నంకు ప్రాధాన్యత లభించడం లేదని, ఏ కమిటీలోనూ ఆయనకు చోటు దక్కలేదని ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆదివారం గాంధీ భవన్‌లో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరుగుతుండగా పొన్నంకు అనుకూలంగా పొన్నం అనుచరులు నినాదాలు చేస్తూ ఆందోళన దిగారు. దీంతో గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.