బెంగాల్‌లో మణిపూర్ తరహా ఘటన

మణిపూర్​లో ఇద్దరు మహిళలను నగ్నంగా చేసి ఊరేగించిన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కొన్ని రోజులకే అదే తరహా ఘటన ఒకటి పశ్చిమ్​ బెంగాల్​లో వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో కొద్ది రోజుల క్రితం ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రలను చేసి చిత్ర హింసలకు గురిచేశారని, తమ కళ్ల ముందే ఇంతటి దారుణం జరుగుతున్నప్పటికీ పోలీసులు మౌన ప్రేక్షక పాత్ర పోషించారని బిజెపి శనివారం ఆరోపించింది. 
ఈ దారుణ ఘటన జులై 19న మాల్డాలో జరిగిందని, ఇద్దరు గిరిజన మహిలలను వివస్త్రలను చేసిన మూకలు నగ్నంగా ఉన్న వారిని క్రూరంగా హింసించారని ఆరోపిస్తూ బిజెపి ఐటి విభాగం అధిపతి, పశ్చిమ బెంగాల్ బిజెపి ఇన్‌చార్జ్ అమిత్ మాల్వీయ శనివారం ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి బ్లర్ చేసిన ఒక వీడియోను కూడా ఆయన పోస్టు చేశారు. 
 
మణిపూర్ ఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీపై ఆయన ఎదురుదాడి చేశారు. తన రాష్ట్రంలో ఇంత ఘోరం జరిగినప్పటికీ మమతా బెనర్జీ హృదయం ముక్కలు కాలేదని, బెంగాల్ హోం మంత్రిత్వశాఖను కూడా చూస్తున్న మమతా బెనర్జీ గగ్గోలు పెట్టే బదులు తగిన రర్యలు తీసుకోవచ్చునని ఆయన ధ్వజమెత్తారు.

బెంగాల్‌లో ఇద్దరు గిరిజన మహిళలపై జరిగిన దాడి సంఘటనపై మమతా బెనర్జీ మాట్లాడకపోవడాన్ని మాల్వీయ తప్పుపట్టారు. ఈ ఘటనను ఆమె ఖండించడం కాని, ఆవేదన వ్యక్తం చేయడం కాని చేయలేదని, అలా చేస్తే ముఖ్యమంత్రిగా తన వైఫల్యాన్ని ఒప్పుకున్నట్లు అవుతుందన్న కారణంతోనే ఆమె మౌనం వహిస్తున్నారని మాల్వీయ ఆరోపించారు.

బెంగాల్‌లో భయోత్పాతం కొనసాగుతోందని, మాల్డాలోని బంగన్‌గోలా పోలీసు స్టేషన్ పరిధిలోని పకువా మఠ్ ప్రాంతంలో ఇద్దరు గిరిజన మహిళలను మూకలు విస్త్రలను చేసి విచక్షణారహితంగా కొడుతూ హింసించారని మాల్వీయ తెలిపారు.

సంబంధిత ఘటన బెంగాల్​లోని మాల్దా జిల్లాకు చెందిన పఖౌహట్​ గ్రామంలో మూడు- నాలుగు రోజుల క్రితం జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు మహిళలు దొంగతనానికి పాల్పడుతున్నారన్న అనుమానంతో గ్రామస్థులు వారిని పట్టుకుని దారుణంగా కొట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

అనంతరం ఆ ఇద్దరు మహిళలను అక్కడి స్థానికులు అర్ధ నగ్నంగా చేశారు. స్థానికుల్లో చాలా మంది మహిళలే ఉండటం గమనార్హం. ఆ తర్వాత వారిని కొడుతూ, ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ వీడియో చూసిన తర్వాతే తమకు ఘటన గురించి తెలిసిందని తెలిపారు.

“మా వద్దకు వచ్చి ఎవరు ఫిర్యాదు చేయలేదు. వైరల్​ వీడియో చేసిన తర్వాతే మాకు ఈ విషయం గురించి తెలిసింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇద్దరు మహిళలు దొంగతనానికి పాల్పడుతుండగా దుకాణంలోని ఓ మహిళ వారిని పట్టుకుంది. అనంతరం రోడ్డు మీదకు తీసుకొచ్చింది. స్థానికులు ఆ మహిళలపై దాడి చేశారు. కొందరు మహిళలు వారిద్దరిని అర్ధ నగ్నంగా చేసి కొట్టారు. కొద్ది సేపటి తర్వాత బాధితులు అక్కడి నుంచి పారిపోయారు” అని వివరించారు. 

అయితే దుకాణదారులు కూడా ఫిర్యాదు చేయలేదని పోలీస్ అధికారులు వెల్లడించారు. కాగా, ఇది దొంగతనం కేసు కావడంతో రాజకీయం చేయాల్సిన అవసరం లేదని టిఎంసి నేత, బెంగాల్ మంత్రి శశి పంజా తెలిపారు. ఇద్దరు మహిళలు మార్కెట్ నుండి ఏదో దొంగతనం చేసే ప్రయత్నం చేస్తే, కొందరు మహిళలు పట్టుకుని కొట్టారని చెబుతూ పోలీసులు ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నారని, తగు చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.