మణిపూర్‌ ఘటనలో ఐదో నిందితుడి అరెస్ట్

జాతి ఘర్షణల మధ్య ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన ఇటీవలే దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. దీంతో ప్రభుత్వ సంస్థలు, భద్రతా దళాలు రాష్ట్రంలోని అన్ని సంఘటనలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.  ఈ కేసులో ఐదో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
కాగా, వైరల్ వీడియోలో కనిపిస్తోన్న వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు మణిపూర్ లోయ, పర్వత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. పలు జిల్లాల్లో 126 చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు వివరించారు.  తాజాగా అదుపులోకి తీసుకున్న ఐదో నిందితుడిని యుమ్లెంబమ్ నుంగ్సితోయ్ (19)గా గుర్తించినట్లు తెలిపారు.
మరోవైపు ఈ ఘటనలో ఇప్పటికే అరెస్టైన నలుగురు నిందితులకు కోర్టు 11 రోజుల పోలీసు కస్టడీ విధించింది. ఘటనకు సంబంధించి పోలీసులు ఈ 11 రోజుల పాటు నిందితులను ఇంటరాగేట్ చేయనున్నారు. మే 3న ప్రారంభమైన హింసాత్మక ఘర్షణల తర్వాత ఏజెన్సీలు డిజిటల్ ప్లాట్ ఫారమ్ లపై నిఘాను కఠినతరం చేసినట్లు చెప్పాయి. ఇప్పటి వరకూ 6,000లకు పైగా కేసులు నమోదు చేసినట్లు తెలిపాయి. వీటిలో ఎక్కువగా ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టడం, నాశనం చేయడం వంటి వాటికి సంబంధించినవే.

ఈ కేసులోని ప్రధాన నిందితులలో ఒకడి ఇంటిని గురువారం మహిళలు తగలబెట్టారు. మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న వీడియోలో ఈ నిందితుడు ప్రధానంగా కనిపించినట్లు పోలీసులు తెలిపారు. బాధిత మహిళల్లో ఒకరు కార్గిల్ యుద్ధంలో అస్సాం రెజిమెంట్ కు చెందిన సుబేదార్ పోస్టులో భారతీయ సైన్యం తరఫున పోరాడిన మాజీ సైనికుడి భార్య అన్న విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.

ఇదిలా ఉండగా ఇద్దరు గిరిజన మహిళలపై జరిగిన అనాగరిక, అమానవీయ దాడి ఘటనను యునైటెడ్ నాగా కౌన్సిల్, ఆల్ నాగా స్టూడెంట్స్ అసోసియేషన్‌తోసహా అనేక నాగా పౌర సమాజ సంఘాలు ఖండించాయి. బాధిత మహిళలకు సత్వర న్యాయం అందచేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని మణిపూర్ ప్రభుత్వాన్ని యునైటెడ్ నాగా కౌన్సిల్ డిమాండ్ చేసిది.

 సోషల్ మీడియాలో వైరల్ గా మారే వదంతులతో ఇతర ప్రాంతాల్లో ఆందోళనలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, దీనిని అడ్డుకోవడానికి గట్టి నిఘా పెట్టామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఈ గందరగోళ పరిస్థితుల మధ్య స్థానిక పోలీసు  స్టేషన్లలో వనరుల కొరత ఏర్పడింది. దీంతో హత్య, దాడి వంటి తీవ్రమైన నేరాల దర్యాప్తుకు ఆటంకం కలుగుతోంది. 

ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలను నిర్వహించడమే ప్రధానంగా మారింది. ఈ సమస్యలను పరిష్కరించడానికి, శాంతి భద్రతల సమస్యలను ఎదుర్కొనేందుకు రాష్ట్ర పోలీసులకు సహాయం చేయడానికి కేంద్రం 135 విభాగాలను అక్కడికి పంపింది. అయితే, ఇప్పటికీ ఇంకా చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నప్పటికీ.. పరిస్థితి అదుపులోకి వస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పడమే ప్రధాన లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని అధికారులు వివరించారు. ‘మణిపూర్‌లోని 16 జిల్లాల్లో సగం ఇప్పటికీ సమస్యాత్మకంగానే ఉన్నాయి. ఈ పరిస్థితిని పూర్తిగా కంట్రోల్ చేయడానికి బలగాలను రొటేషన్ విధానంలో వాడుతున్నాం’ అని సంబంధిత అధికారులు తెలిపారు.