సిద్ధరామయ్యపై అనర్హత పిటిషన్

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో  పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు జులై 28న విచారణ చేపడతామని తెలిపింది. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వరుణ నియోజకవర్గం నుంచి సిద్ధరామయ్య విజయం సాధించారు.  కాంగ్రెస్ మేనిఫేస్టోలో ప్రకటించిన ఐదు హామీలు ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సెక్షన్ 123 (2) ప్రకారం లంచం, ప్రలోభాలకు గురిచేయడమేనని పిటిషనర్ పేర్కొన్నారు. రాజ్యాంగ నిబంధనలు, ప్రజాప్రాతినిధ్య చట్టంలో మార్గదర్శకాలను సిద్ధరామయ్య ఉల్లంఘించారని ఆరోపించారు.

‘కాంగ్రెస్, ఆ పార్టీ అభ్యర్ధి హామీలు, వాగ్దానాలు ప్రతివాది (సిద్దరామయ్య) సమ్మతితో జరిగింది. వరుణ నియోజక వర్గంలో నేరుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అంటే ప్రతివాదికి ఓటు వేసేలా ఓటర్లను ప్రేరేపించే లక్ష్యంతో ఈ హామీలు ఉన్నాయి. సిద్ధరామయ్యకు అనుకూలంగా ఓటు వేయడం పరిగణనలోకి తీసుకోవాలి’ అని పేర్కొంటూ వరుణ నియోజకవర్గానికి చెందిన కేఎం శంకర అనే ఓ పౌరుడు ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌‌ను జస్టిస్ ఎస్ సునీల్ దత్ యాదవ్ ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిద్ధరామయ్య అవినీతికి పాల్పడ్డారని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రమీణా నెసర్గి హాజరయ్యారు. ఐదు గ్యారంటీలను ఓట్లు అడగడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని, సిద్ధరామయ్య కేవలం ఓ ఉదాహరణ మాత్రమేనని తెలిపారు.

‘మేనిఫెస్టోలో చోటు దక్కించుకున్న వ్యక్తులందరి పేర్లు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 123(1), (2) అవినీతికి సంబంధించి ఉమ్మడిగా బాధ్యత వహిస్తాయి’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సింగిల్ జడ్జ్ బెంచ్.. లేవనెత్తిన అభ్యంతరాలపై వివరాలను అందజేయాలని సూచించింది. అనంతరం విచారణను జులై 28కు వాయిదా వేసింది.