యాసిన్ మాలిక్ `సుప్రీం’కు వ్యక్తిగత హాజరుపై ఆందోళన

టెర్రర్ ఫండింగ్ కేసులో తీహార్ జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్ యాసిన్ మాలిక్ సుప్రీంకోర్టు ముందు శుక్రవారంనాడు వ్యక్తిగతంగా హాజరు కావడం సంచలనమైంది. దీనిపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.  యాసిన్ మాలిక్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర హోం సెక్రటరీకి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా లేఖ రాశారు.
జమ్మూ కోర్టు ఆదేశాలపై సీబీఐ వేసిన పిటిషన్‌పై విచారణ కోసం యాసిన్ మాలిక్ అత్యున్నత న్యాయస్థానం ముందు హాజరయ్యారు. ఈ పరిణామం పట్ల న్యాయమూర్తులు సూర్యకాంత్, డిపాకర్ దత్త కూడా విస్మయం వ్యక్తం చేశారు. అతనిని భౌతికంగా కోర్టులో హాజరు పరచమని తాము ఎటువంటి ఆదేశాలు జారీచేయలేదని స్పష్టం చేశారు.
ఉగ్రవాది యాసిన్ మాలిక్‌ సుప్రీంకోర్టు ముందు హాజరుకావడం తీవ్రమైన భద్రతా లోపం కిందకు వస్తుందని, ఇందువల్ల ఆయన తప్పించుకోవడం కానీ, బలవంతంగా ఎత్తికెళ్లడం కానీ, ఆయనను హతమార్చే అవకాశాలు ఉంటాయని తుషార్ మెహతా హోం సెక్రటరీకి రాసిన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. 
 
యాసిన్ మాలిక్ తీవ్రవాది, వేర్పాటువాది మాత్రమే కాకుండా ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారనే ఆరోపణపై దోషిగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడని గుర్తు చేశారు. పాక్ ఉగ్రవాద సంస్థలతో కూడా ఆయనకు సంబంధం ఉన్నందున అతను తప్పించుకోవడం, లేదా బలవంతంగా ఆయనను తప్పించడం, ఎవరైనా హతమార్చడం చేయవచ్చని పేర్కొన్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగానా సుప్రీంకోర్టు భద్రతకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐపీసీ సెక్షన్ 268 ప్రకారం జైలు అధికారులకు జైలు ఆవరణ దాటి యాసిన్‌ను తీసుకువచ్చే అధికారం లేదని ఎస్జీ స్పష్టం చేశారు.
 
వ్యక్తిగత హాజరును కోరుకున్నందున మాలిక్‌ను జైలు అధికారులు కోర్టుకు తీసుకువస్తున్నారని తెలిసి తాము దిగ్భ్రాంతికి గురయ్యారని, హోం సెక్రటరీ దృష్టికి తాను ఈ అంశం తీసుసువచ్చేలోపే మాలిక్ సుప్రీంకోర్టుకు చేరుకున్నారని ఆయన వివరించారు. ఈ అంశం తీవ్రతను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని హోం సెక్రటరీని తుషార్ మెహతా కోరారు.