బీజేపీతో కలిసి పనిచేస్తామని జేడీఎస్ వెల్లడి

కర్నాటకకు చెందిన జెడిఎస్ ఇక బిజెపితో కలిసి నడుస్తుంది. ఈ విషయాన్ని జెడిఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీ, తమ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నాయని చెబుతూ ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం తమ రెండు పార్టీలు కలిసికట్టుగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తాయని తెలిపారు. ఈ మేరకు తమ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి జెడిఎస్ పూర్తిగా వెనుకబడింది. పార్టీ సంబంధిత కీలక రాజకీయ నిర్ణయం తీసుకునేందుకు తనకు తమ నేత, మాజీ ప్రధాని దేవెగౌడ అధికారం ఇచ్చారని కుమారస్వామి తెలిపారు. తమ పార్టీ ప్రతిపక్షంగా కొనసాగుతుందని, ఇదే దశలో బిజెపితో సఖ్యత ఉంటుందని తెలిపారు.

ఇక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చాలా సమయం ఉన్నందున తమ పార్టీ వైఖరి గురించి ఇప్పటికిప్పుడు చెప్పాల్సిన పనిలేదని చెబుతూనే ఎన్నికల పొత్తుకు సిద్దమనే సంకేతం ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే జెడిఎస్ ఎన్‌డిఎలో చేరుతుందనే వార్తలు వెలువడ్డ దశలో కుమారస్వామి తమది బిజెపితో అనధికారిక మిత్రత్వం ఉంటుందని వెల్లడించడం ప్రాధాన్యత సంతరింప చేసుకుంది. 

కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ పార్టీ జెడిఎస్, బిజెపిలు ప్రతిపక్షాలుగా ఉన్న విషయాన్ని ఈ దశలో ఆయన గుర్తు చేశారు. కాగా, గురువారం రాత్రి జేడీఎస్‌ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఆ పార్టీ చీఫ్‌ హెచ్డీ దేవగౌడ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీతో జతకట్టడం, 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో  ఎన్డీయే మిత్రపక్షంగా ఉండటంపై చర్చించారు. అలాగే కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పేందుకు, పార్టీ బలోపేతం కోసం, అన్ని వర్గాల ప్రతినిధులతో కూడిన 10 మంది సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేయాలని జేడీఎస్‌ నిర్ణయించింది.

ఇలా ఉండగా, అమర్యాదకరంగా వ్యవహరించిన 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలను  సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ గత బుధవారం ప్రకటించడాన్ని బీజేపీతో పాటు కలిసి జేడీఎస్ కూడా తీవ్రంగా ఖండించింది. ఈ విషయమై అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ ఎమ్యెల్యేలు జరిపిన నిరసనలో కుమారస్వామితో పాటు ఇతర జేడీఎస్ ఎమ్యెల్యేలు కూడా పాల్గొన్నారు.

దళితుడైన డిప్యూటీ స్పీకర్‌ రుద్రప్ప లమాణిపై కాగితాలు విసిరినందునే శాసనసభలో 10 మంది బీజేపీ సభ్యులను సస్పెండ్‌ చేయాల్సి వచ్చిందంటూ సీఎం సిద్ధరామయ్య చేసిన వాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. ప్రొటోకాల్‌ దుర్వినియోగం విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే దళితకార్డును కాంగ్రెస్‌ తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. 

ప్రొటోకాల్‌ దుర్వినియోగం వ్యవహారంపై ప్రభుత్వం తప్పించుకోజాలదని  ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనని తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌ దళిత ప్రేమ బూటకమని నిజంగానే మీకు దళితులపై ప్రేమ ఉంటే తక్షణమే రాజీనామా చేసి దళితుడిని సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని ఆయన సిద్ధరామయ్యకు సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఇక చూస్తూ ఊరుకునేదిలేదని ప్రజాక్షేత్రంలో బీజేపితో కలిసి పోరాడాలని పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా తీర్మానించారని కుమారస్వామి వెల్లడించారు.