జ్ఞానవాపి మసీదు శాస్త్రీయ సర్వేకు అనుమతి

హిందూ సంఘాలు శివలింగం ఉందని వాదిస్తోన్న వజుఖానా (కొలను) మినహా జ్ఞానవాపీ మసీదు ప్రాంగణం మొత్తాన్ని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)తో శాస్త్రీయ సర్వేకు వారణాసి జిల్లా కోర్టు శుక్రవారం అనుమతించింది. ఈ సర్వే నివేదికను ఆగస్టు 4లోగా అందజేయాలని కోర్టు ఆదేశించింది. 
 
అయితే, ఈ ఆదేశాలను ముస్లిం సంఘాలు పై కోర్టుల్లో సవాల్ చేసే అవకాశం ఉంది. శివలింగం అని చెప్పుకునే నిర్మాణం ఉన్న వజుఖానా ప్రాంతాన్ని సీల్ చేయాలని గతేడాది సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.  మసీదు నిర్మాణంపై శాస్త్రీయ సర్వే నిర్వహించాలని కోరుతూ నలుగురు హిందూ మహిళలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణకు కోర్టు స్వీకరించింది. 
 
ఈ కేసులో పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది విష్ణుశంకర్ జైన్ మాట్లాడుతూ ‘నా పిటిషన్‌ను ఆమోదించిన కోర్టు. సీలు వేసిన వజుఖానా (కొలను) మినహాయించి జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఏఎస్‌ఐతో సర్వే నిర్వహించాలని ఆదేశించినట్టు నాకు సమాచారం అందింది’ అని తెలిపారు.
కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో పురాతన హిందూ దేవాలయం గుర్తులు ఉన్నాయని పేర్కొంటూ నలుగురు మహిళలు పిటిషన్లు దాఖలు చేశారు.
 
‘ఆ ప్రదేశంలో స్వయంభూ జ్యోతిర్లింగం లక్షల సంవత్సరాలుగా ఉనికిలో ఉందని, అయితే, విగ్రహారాధకులపై ద్వేషం పెంచుకున్న ముస్లిం ఆక్రమణదారుల దాడులు క్రీ.శ. 1017లో మహమూద్ ఘజనీ దాడితో ప్రారంభమయ్యాయని, అనేక సార్లు ధ్వంసం చేసి నష్టం కలిగించారు’ అని పిటిషన్‌లో ఆరోపించారు.

‘అత్యంత మతోన్మాది, క్రూరమైన మొఘల్ చక్రవర్తులలో ఒకరైన ఔరంగజేబు మసీదు ఉన్న స్థలంలోని ఆదివిశేశ్వరుని ఆలయాన్ని కూల్చివేయాలని 1669లో ఫర్మానా (డిక్రీ)ని జారీ చేయడంతో అతడి అనుచరులు ఈ ఆజ్ఞలను అమలు చేశారు. జ్ఞానవాపి మసీదు వివాదాన్ని పురావస్తు పరిశోధన ద్వారా మాత్రమే పరిష్కరించవచ్చు’ అని లాయర్ జైన్ గతంలో వాదించారు. 

 
అయితే, ఈ అభ్యర్ధనను వ్యతిరేకించిన మసీదు కమిటీ ఏఎస్ఐ సర్వే మసీదు కాంప్లెక్స్‌ను దెబ్బతీస్తుందని పేర్కొంది.  మసీదు పూర్తిగా హిందూ ఆలయ పరిధిలోకి వస్తుందని, ఇక్కడనే మసీదును కట్టడం అక్రమమని పిటిషనర్లు పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనల తరువాత కోర్టు ఈ నెల 14న తీర్పు రిజర్వ్ చేసింది.
 
గత ఏడాది వీడియోగ్రఫీ సర్వేలో జ్ఞానవాపి మసీదు సముదాయంలో బయటపడిన శివలింగం ఆకారానికి కార్బన్ డేటింగ్‌తో సహా శాస్త్రీయ సర్వేని నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో జ్ఞానవాపి మసీదుకు సంబంధించిన ప్రధాన కేసులలో ఒకదానిలో మసీదు కమిటీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. 
 
స్థానిక కోర్టులో విచారణలో ఉన్న సివిల్ దావాను రద్దు చేయాలన్న వారి అభ్యర్థనను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలోని ప్రార్థనలకు అనుమతి కోరుతూ హిందూ మహిళల బృందం దాఖలు చేసిన వ్యాజ్యం చెల్లుబాటు అవుతుందని పేర్కొన్న హైకోర్టు వారణాసి జిల్లా కోర్టులో కేసును కొనసాగించడానికి అనుమతించింది.