500వ అంతర్జాతీయ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ

ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ ఒకే సెంచ‌రీతో ప‌లు రికార్డులు బ‌ద్ధ‌లు కొట్టాడు. ఐదొంద‌ల అంత‌ర్జాతీయ మ్యాచ్‌లో శ‌త‌కం సాధించిన అత‌ను దిగ్గ‌జ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌ను అధిగ‌మించాడు. మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ కంటే త‌క్కువ ఇన్నింగ్స్‌ల్లోనే విరాట్ 76వ సెంచ‌రీ బాద‌డం విశేషం.  స‌చిన్ 587 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయికి చేరువ‌య్యాడు. విరాట్ మాత్రం 559 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు.
స‌చిన్ కంటే 28 కంటే త‌క్కువ ఇన్నింగ్స్‌ల్లో కింగ్ కోహ్లీ రికార్డు శ‌త‌కం బాదాడు.  వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో 180 బంతుల్లో 10 ఫోర్ల‌తో కింగ్ కోహ్లీ శ‌త‌కం పూర్తి చేసుకున్నాడు.  పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‍తో జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీ చేసిన కోహ్లీ  500వ అంతర్జాతీయ మ్యాచ్‍లో శతకం సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
అత‌డి కంటే ముందు స‌చిన్(664), ఎంఎస్ ధోనీ(538), రాహుల్ ద్ర‌విడ్‌(509)లు టీమిండియా త‌ర‌ఫున‌ 500ల మ్యాచ్‌లు ఆడారు. కానీ, వీళ్లలో ఎవ‌రూ కూడా సెంచ‌రీ కొట్ట‌లేక‌పోయారు.  చిర‌స్మ‌ర‌ణీయ‌ సెంచ‌రీతో కోహ్లీ ప‌లు రికార్డులు బద్ధలు కొట్టాడు. వెస్టిండీస్‌పై అత్య‌ధిక సెంచ‌రీలు కొట్టిన ద‌క్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండ‌ర్‌ జాక్వెస్ క‌లిస్  రికార్డు స‌మం చేశాడు.
క‌లిస్ విండీస్‌పై 12 శ‌త‌కాలు బాదాడు. అయితే.. ఈ జాబితాలో టీమిండియా దిగ్గ‌జం సునీల్ గ‌వాస్క‌ర్ (13) అగ్ర‌స్థానంలో ఉన్నాడు. ద‌క్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఏబీ డివిలియ‌ర్స్ 11 సార్లు విండీస్‌పై వంద కొట్టారు.  ఈ సెంచరీతో కలిపి టెస్టుల్లో ఇప్పటివరకు విరాట్‌ కోహ్లీ 29 శతకాలు బాదాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 76వ శతకం నమోదు చేశాడు.
కోహ్లీకి వన్డేల్లో 46, టీ-20ల్లో ఒక సెంచరీ ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ వంద సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. తర్వాతి స్థానంలో విరాట్‌ కోహ్లీ(76) నిలిచాడు. విరాట్‌ తర్వాత వరుసగా రికీ పాంటింగ్‌(71), కుమార సంగక్కార(63), జాక్‌ కల్లిస్‌(62) సెంచరీలతో ఉన్నారు.
అయితే 500 అంతర్జాతీయ మ్యాచులు పూర్తయ్యే సరికి సచిన్‌ 75 సెంచరీలు నమోదు చేయగా విరాట్‌ కోహ్లీ ఖాతాలో 76 సెంచరీలు ఉన్నాయి. విదేశాల్లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్లలో సచిన్‌(29), తర్వాతి స్థానంలో కోహ్లీ(28) నిలిచాడు. వీదేశీ గడ్డపై ఇంకో సెంచరీ సాధిస్తే సచిన్‌ను సమం చేస్తాడు.
 
ప్రస్తుతం యాక్టివ్‌ ప్లేయర్లతో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్‌ కోహ్లీదే అగ్రస్థానం. విరాట్‌ కోహ్లీ 76 సెంచరీలు చేయగా, రెండో స్థానంలో ఉన్న జో రూట్‌ 46 శతకాలు చేశాడు. కోహ్లీకి రూట్‌కు మధ్య భారీ గ్యాప్‌ ఉంది. డేవిడ్‌ వార్నర్‌ 45, స్టీవ్‌ స్మిత్‌ 44, రోహిత్‌ శర్మ 44 సార్లు మూడంకెలు స్కోరు అందుకున్నారు.
కాగా, మెుదటి టెస్టులో భారత బౌలర్ల మెరుపులతో విండీస్ చిత్తుగా ఓడింది. తక్కువ స్కోరుకే ఆలౌటైంది. దీంతో ఇన్నింగ్స్ తేడాతో భారత్ గెలిచింది. అయితే రెండో టెస్టులో మాత్రం విండీస్ ఆటగాళ్లు ప్రతిఘటిస్తున్నారు. రెండోరోజు ఆట ముగిసే సమయానికి 86/1 స్కోరుతో నిలిచారు. క్రీజులో క్రెయిగ్ బ్రాత్ వైట్ 37, మెకంజీ 14 ఉన్నారు. విండీస్ ఇంకా 352 పరుగుల వెనకంజలో ఉంది. భారత్ 438 పరుగులకు ఆలౌటైంది. చాలా ఏళ్ల తర్వాత.. భారత్ అవతల కోహ్లీ శతకం సాధించాడు.