జన ప్రభంజనంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కొట్టుకుపోతాయి 

తెలంగాణలో జన ప్రభంజనం రానుందని చెబుతూ నిశ్శబ్ధ విప్లవం వస్తుందని, ఇందులో బీఆర్ఎస్, కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్త్ర అధ్యక్షునిగా నియమించిన తర్వాత శుక్రవారం రాష్త్ర కార్యాలయంలో తన బాధ్యతలు చేపడుతూ వెయ్యిమంది కేసీఆర్ లు, లక్షమంది ఒవైసీలు వచ్చినా.. వేలాది మంది రాహుల్ గాంధీలు కలిసివచ్చినా.. మోదీని ఢీకొట్టలేరు, బీజేపీని ఓడించలేరని వెల్లడిచేశారు.
 
కుటుంబ, అవినీతి సర్కారుకు వ్యతిరేకంగా తమ పోరాటం మరింత ఉధృతం చేస్తామని చెబుతూ “రజాకార్లను తరిమిన తెలంగాణ గడ్డఇది, నీ డబ్బు, అధికారం, పోలీసులు మా పోరాటాన్ని అపలేవు” అంటూ సీఎం కేసీఆర్ ను హెచ్చరించారు.  బీఆర్​ఎస్​ ప్రభుత్వాన్ని అబిడ్స్​ చౌరస్థాలో పాతరేసే వరకు నిద్రపోయేది లేదని స్పష్టం చేశారు. కేసీఆర్​ కుటుంబాన్ని ఫామ్​హౌజ్​లో అరెస్ట్​ చేయాల్సిన సమయం వచ్చిందని కిషన్ రెడ్డి వెల్లడించారు.
తన దగ్గర అధికారం, డబ్బు, పోలీసులు ఉన్నయని కేసీఆర్​ అనుకుంటుండొచ్చు.. ఖబడ్దార్​ కేసీఆర్​.. రజాకార్లను తరిమికొట్టిన చరిత్ర తెలంగాణది. ఆ విషయం మరిచిపోవద్దని హెచ్చరించారు.  బీఆర్​ఎస్​, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్​ దుష్ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్​ పార్టీ ఆఫీసుకు పదెకరాల భూమి బీఆర్​ఎస్​ ఎందుకు ఇచ్చింది? రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన బిడ్డను అభ్యర్థిగా పెడితే.. కేసీఆర్​ కాంగ్రెస్​కు ఎందుకు మద్దతు ఇచ్చారు? అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు.
 
తాము కాంగ్రెస్​, బీఆర్​ఎస్ ల​తో ఎప్పుడూ కలవలేదని, భవిష్యత్​లో కూడా కలిసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.  అడుగడుగునా బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలను అడ్డుకోవాలి, నిలదీయాలని ఆయన బిజెపి కార్యకర్తలకు పిలుపిచ్చారు. 1200 మంది అమరవీరుల కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరడం కోసం కృషి చేస్తున్నామని గుర్తుంచుకోవాలని కోరారు.
 
ఎంఐఎం, బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ మూడు పార్టీల్లో దేనికి ఓటేసినా.. మూడు ముక్కల పార్టీకి వేసినట్లే అని హెచ్చరించారు.  లక్ష మంది అసదుద్దీన్​ ఓవైసీలు, లక్ష మంది కేసీఆర్​లు, లక్షమంది రాహుల్​ గాంధీలు వచ్చినా.. 2024లో మోదీ నేతృత్వంలోని బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరని కిషన్ రెడ్డి భరోసా వ్యక్తం చేశారు.  ఈ దేశ ప్రజలు మోదీ లాంటి సమర్థ నాయకత్వం కోరుకుంటున్నారని చెబుతూ గతంలో ఎవరూ స్థిరంగా ప్రధానిగా లేరని, కానీ ఇప్పుడు మోదీ నాయకత్వాన్ని ప్రపంచం కోరుకుంటున్నదని తెలిపారు.
తెలంగాణలో అనేక ఏండ్లు కాంగ్రెస్​ పార్టీ అధికారంలో ఉన్నదని, ఆ పార్టీ చేయని అవినీతి, కుట్ర లేదని ధ్వజమెత్తారు.  బీఆర్​ఎస్​ పార్టీ కూడా తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని అంటూ ఇప్పుడు రాష్ట్రంలో ఇసుక, ల్యాండ్​, లిక్కర్​ సహా అన్ని మాఫియాలే అని మండిపడ్డారు. ఇప్పుడు రాష్ట్రంలో రావాల్సింది బీజేపీ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు.  అధికారంను అడ్డుపెట్టుకొని రాష్ట్రాన్ని శాసించడం దేశానికి ఆదర్శమా కేసీఆర్​ గారు? అంటూ ప్రశ్నించారు.
కిషన్ రెడ్డికి  బండి సంజయ్ బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎన్నికల ఇన్ ఛార్జ్ ప్రకాష్ జవదేకర్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ, బిజేపీ నేతలు మురళీధర్ రావు, ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎంపి అరవింద్,మాజీ ఎంపీ విజయశాంతి తదితరులు హాజరయ్యారు.