
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రెండో రోజు కూడా మణిపూర్ పరిస్థితిపై ప్రతిపక్షాల నినాదాలతో దద్దరిల్లింది. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనతోపాటు, మే 3 నుంచి కొనసాగుతున్న హింసాకాండ గురించి చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. లోక్‌సభ, రాజ్యసభలలో శుక్రవారం కార్యకలాపాలు ప్రారంభమైన కాసేపటికే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు.
ప్రతిపక్ష సభ్యులు శాంతించకపోవడంతో లోక్ సభను సోమవారానికి వాయిదా వేశారు. కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి మణిపూర్ సమస్యపై చర్చించాలని ప్రతిపక్షాలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు పార్లమెంటులో రూల్ 267 vs రూల్ 176 కింద కేంద్ర ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య యుద్ధం నడుస్తోంది. నిబంధన 267 కింద పూర్తి కార్యకలాపాలను రద్దు చేసి దీర్ఘకాలిక చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అయితే నిబంధన 176 కింద తక్కువ సమయం చర్చకు కేటాయించనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
మణిపూర్‌పై చర్చను ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా కోరుకోవడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆరోపించారు. ప్రతిపక్షాలు పదే పదే తమ వైఖరిని మార్చుకుంటున్నాయని విమర్శించారు. మణిపూర్‌పై చర్చకు కేంద్రం సిద్ధంగా ఉందని, హోంమంత్రి సమాధానమిస్తారని స్పష్టం చేశారు. మణిపూర్‌పై కేవలం అరగంట చర్చ కాదని, నిబంధన 267 కింద పార్లమెంట్ పూర్తి కార్యకలాపాలను రద్దు చేయాలని కోరుతున్నట్లు ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, మణిపూర్ సమస్యపై చర్చ జరపడంపై ప్రతిపక్షాలకు శ్రద్ధ లేదని ఆరోపించారు. ఈ సమస్యపై చర్చించాలని ప్రభుత్వం కోరుకుంటోందని ఆయన స్పష్టం చేశారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. అయినప్పటికీ, ప్రతిపక్షాలు చర్చకు సిద్ధపడటం లేదని, దీనినిబట్టి వారికి ఈ సమస్య పట్ల శ్రద్ధ లేదని స్పష్టమవుతోందని ఆయన మండిపడ్డారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోదీ గురువారం పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు మాట్లాడారని, మణిపూర్ సంఘటన వల్ల యావత్తు దేశం సిగ్గుతో తలదించుకుంటోందని చెప్పారని గుర్తు చేశా. ప్రస్తుతం మణిపూర్‌లో చాలా సున్నితమైన పరిస్థితులు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
అన్ని వర్గాల ప్రజలు బాధపడుతున్నారని చెబుతూ దోషులను అరెస్ట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ సమస్య గురించి అంతర్జాతీయ వేదికలపై చర్చ జరుగుతోందని, కానీ మన పార్లమెంటులో మాత్రం చర్చించడం లేదని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ద్వజమెత్తారు. మణిపూర్‌లో శాంతిభద్రతల గురించి ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. ‘నిర్భయ’ కేసులో అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ అప్పటి ప్రభుత్వాన్ని వణికించిందని గుర్తు చేశారు. ఇప్పుడు అదే బీజేపీ మొసలికన్నీరు కార్చుతోందని విమర్శించారు.
More Stories
పాకిస్తాన్ నటుడి సినిమాపై కేంద్రం నిషేధం
వేయి మంది మావోయిస్టులను చుట్టుముట్టిన 20 వేల బలగాలు
ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష