వివేకా హత్యా కేసులో సాక్షిగా వైఎస్ షర్మిల

ఏపీలో రాజకీయ కలకలం రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యా కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలను సాక్షిగా సీబీఐ చేర్చింది. గతేడాది అక్టోబర్ 7న ఆమె సీబీఐ కి ఇచ్చిన వాంగ్మూలంను ఈ కేసులో కేసులో 259వ సాక్షిగా సీబీఐ కోర్టులో సమర్పించింది. అందులో హత్యకు కుటుంభం, ఆర్ధికపరమైన కారణాలు  కాకూండా, రాజకీయ అంశాలే ఉన్నట్లు ఆమె చెప్పడం గమనార్హం.
 
కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసి గత నెల 30న కోర్టుకు సమర్పించింది. కోర్టు విచారణకు స్వీకరించడంతో ఈ వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అవినాశ్ కుటుంబానికి వ్యతిరేకంగా వివేకా నిలబడటమే కారణం కావచ్చని షర్మిల అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. వారికి అడ్డొస్తున్నారని మనసులో పెట్టుకోవచ్చని షర్మిల అభిప్రాయపడ్డారు.

‘‘నా వద్ద ఆధారాలు లేవు కానీ.. రాజకీయ కోణంలోనే ఈ హత్య జరిగింది.. ఈ హత్యకు కుటుంబం ఆర్థిక అంశాలు కారణం కాదు.. పెద్ద కారణమే ఉంది.. అవినాష్ కుటుంబానికి.. వివేకా వ్యతిరేకంగా ఉండడమే హత్యకి కారణం కావచ్చు.. వారి దారికి వివేకా అడ్డొస్తున్నాడని హత్య చేసి ఉండవచ్చు” అంటూ ఆమె సిబిఐ ముందు చెప్పారు. 

పైగా, హత్యకు కొన్ని నెలలు ముందే వివేకా బెంగళూరులో తమ ఇంటికి వచ్చి కడప ఎంపీగా పోటీ చేయమని చిన్నాన్న వివేకా తనను అడిగినట్టు ఆమె వెల్లడించారు. ఎంపీగా అవినాష్ రెడ్డి పోటీ చేయవద్దని వివేకా కోరుకున్నారని చెబుతూ అవినాష్‌కు ఎంపీ టికెట్ రాకుండా జగన్ మోహన్ రెడ్డిని ఒప్పిద్దామని తనతో చెప్పారని ఆమె తెలిపారు. 

“ఎట్టి పరిస్థితుల్లో జగన్‌కు వ్యతిరేకంగా నేను వెళ్ళనని నాతో మా చిన్నాన్న చెప్పారు. ఈ విషయంలో జగన్‌ను కచ్చితంగా ఒప్పించగలనని వివేక నాతో చర్చించారు.. తనపై బాబాయ్ పదేపదే ఒత్తిడి తీసుకురావడంతో ఏమి చేయలేక సరే అన్నాను..’’ అంటూ షర్మిల స్టేట్‌మెంట్ లో వివరించారు.

వివేకా హత్య కేసులో సీఎం జగన్‌ ఓఎస్‌డీ పి. కృష్ణమోహన్‌రెడ్డి, విశ్రాంత సీఎస్‌ అజేయ కల్లం, వైసిపి నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జగన్‌ అటెండర్‌ గోపరాజు నవీన్‌కుమార్‌ సాక్షులుగా ఉన్నట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది.

మరోవంక, వివేకానందరెడ్డి హత్యకు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలు కుట్ర చేశారని సీబీఐ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో స్పష్టం చేసింది. కుట్ర, హత్య సాక్ష్యాల చెరిపివేతను కోర్టుకు వివరించింది. గూగుల్ టేక్ అవుట్, ఫోన్ల లొకేషన్ డేటాలు, ఫొటోలను కోర్టుకు సమర్పించింది. వివేకా హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోందని చెప్పింది. 
 
సాక్ష్యాల చెరిపివేత సమయంలో అక్కడ మనోహర్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయన ప్రమేయంపై నిర్ధారణ కాలేదని చెప్పింది. వివేకా ఇంట్లో వైఫై రూటర్లకు కనెక్ట్ అయిన వారి వివరాలు సేకరిస్తున్నామని వివరాలు ఇవ్వాలని అధికారులను కోరామని తెలిపింది.  వివేకా రాసిన లేఖపై నిన్ హైడ్రిన్ పరీక్ష నివేదిక రావాలని చెప్పింది. పలు మొబైల్ ఫోన్ల ఫోరెన్సిక్ రిపోర్టులు త్రివేండ్రం సీడాక్ నుంచి రావాల్సి ఉందని తెలిపింది. విచార‌ణ ప‌లు ద‌శ‌ల‌లో కొన‌సాగుతున్న‌ద‌ని వివ‌రించింది. వివేకా పీఏ కృష్ణారెడ్డిపై అనుమానాలు ఉన్నప్పటికీ తగిన ఆధారాలు లభించలేదని తెలిపింది.