గోదావరి నదికి పెరుగుతున్న వరద ఉధృతి

మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. నేడు భద్రాచలం వద్ద నీటిమట్టం 43.9 అడుగులకు చేరుకోగా, పోలవరం వద్ద 11.97 మీటర్లకు చేరుకుంది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 8.48 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కాబట్టి నేడు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు విపత్తుల సంస్థ పర్యవేక్షిస్తోంది.
 
భద్రాచలం వద్ద గోదావరి గురువారం మధ్యాహ్నం 3.19 గంటలకు 43 అడుగులకు చేరుకోవడంతో కలెక్టర్‌ ప్రియాంక ఆల మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ ఏస్తారు. భద్రాచలం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం (ఫోన్‌ నెంబర్‌ 08743- 232444), కొత్తగూడెం కలెక్టరేట్‌లో కం ట్రోల్‌ రూమ్స్‌ (ఫోన్‌ నంబర్‌- 08744-241950)ను ఏర్పాటు చేశారు. 
 
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ పరిసరాల్లోకి వరద నీరు చేరింది. పాపికొండల విహార యాత్రను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. ములుగు జిల్లాలో ముంపు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ ఎండీ సూచిస్తున్నారు. 
 
సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని కోరుతున్నారు. తూర్పుగోదావరి గంటగంటకూ గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటిమట్టం10.80 అడుగులకు చేరుకుంది. 175 గేట్లను అధికారులు ఇప్పటికే ఎత్తివేశారు. విలీన మండలాల్లో శబరి నది పొంగి ప్రవహిస్తోంది. మరోవైపు వాగులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. 
 
ఇక, తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. గురువారం తెరిపిలేకుండా వానలు పడ్డాయి. నైరుతి రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజులు వర్షాలు పడతాయని, ముఖ్యంగా శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణశాఖ హెచ్చరించింది. 
తెలంగాణలో గత మూడు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తుండడంతో గురువారం రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం శనివారం కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో సెలవులను పొడిగిస్తూ శనివారం కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.
 
రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌, ఆరెంజ్‌,ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. క్షేత్రస్థాయిలో ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు సిద్ధంగా ఉన్నాయి.  హైదరాబాద్‌లో గురువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. పలుచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. 
 
రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో పలుచోట్ల ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి.  భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ ఆదేశించారు. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. ఎగువన కురిసిన వర్షాలతో ప్రాణహితకు వరద పోటెత్తుతున్నది. గురువారం సాయంత్రానికి 5.50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నది. లక్ష్మీబరాజ్‌ నుంచి 65 గేట్లను ఎత్తి వరదను విడుదల చేస్తున్నారు.
 
గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని చెప్పిన వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. నాలుగైదు రోజుల కిందటి వరకు ఏకంగా 20 శాతం వరకు లోటు వర్షపాతం ఉండగా.. బుధవారానికి ఇది ఐదు శాతానికి తగ్గినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. మరో రెండ్రోజులు వానలు కొనసాగే అవకాశం ఉండటంతో లోటు పూర్తిగా భర్తీ అవుతుందని అంచనా.