మహిళల భద్రతపై నిలదీసిన రాజస్థాన్ మంత్రిపై వేటు

మహిళల భద్రతపై సొంత ప్రభుత్వంపైనే రాష్ట్ర మంత్రి విమర్శలు గుప్పించారు. దీంతో గంటల వ్యవధిలోని ఆయనపై ముఖ్యమంత్రి వేటువేశారు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశ్‌క్‌ గెహ్లాట్‌ మంత్రివర్గంలో సైనిక్‌ కల్యాణ్‌ (స్వతంత్ర బాధ్యత), హోంగార్డు, పౌర రక్షణ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా రాజేంద్ర గుడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 
 
అసెంబ్లీలో రాజస్థాన్‌ కనీస ఆదాయ హామీ బిల్లు-2023పై శుక్రవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా సొంత పార్టీకే చెందిన ఎమ్మెల్యేలు మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో బిల్లుపై చర్చకు అంతరాయం ఏర్పడింది.  దీంతో కలుగజేసుకున్న రాజేంద్ర గుడా సొంత రాష్ట్రంలోనే మహిళలకు రక్షణ లేదు, పొరుగు రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. 
 
మణిపూర్ హింసాకాండను రాష్ట్ర అసెంబ్లీలో లేవనెత్తే బదులు సొంత ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు చెప్పారు. రాజస్థాన్‌లోని మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమైన తీరు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని సొంత ప్రభుత్వంపైనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.
 
‘కఠిన వాస్తవం ఏంటంటే.. మన ప్రభుత్వం మహిళలకు భద్రత కల్పించడలో విఫలమవుతోంది. రాజస్థాన్‌లో మహిళలపై అకృత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. కాబట్టి మణిపూర్‌ అంశంపై దృష్టిసారించే బదులు ముందుగా మన రాష్ట్రం సంగతి చూసుకోవడం ఉత్తమం’ అంటూ రాజేంద్ర సింగ్‌ అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

“రాజస్థాన్‌లో మన తల్లులు, సోదరీమణులపై లైంగిక వేధింపుల ఘటనలు జరుగుతున్నాయి. నా సొంత అసెంబ్లీ నియోజకవర్గమైన ఉదయ్ పూర్వతిలోని మహిళలకు తాను రక్షణ కల్పిస్తాని నమ్మి ఎన్నికల్లో గెలిపించారు. కానీ మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయన్నారు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో నాలుగు నెలల్లో జరుగునున్న ఎన్నికల్లో ప్రజల వద్దకు ఎలా వెళ్తామని ఆయన ప్రశ్నించారు.  మంత్రి చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ తీవ్రంగా పరిగణించారు. రాజేంద్ర సింగ్‌ గుధాను మంత్రివర్గం నుంచి వెంటనే తొలగిస్తున్నట్లు రాజస్థాన్‌ రాజ్‌భవన్‌కు సిఫార్సు పంపగా.. గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా దానికి ఆమోదం తెలిపినట్లు సమాచారం. గంట వ్యవధిలోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.