
రాజస్థాన్‌లో మహిళలపై నేరాలు పెరుగుతున్నప్పటికీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూగ ప్రేక్షకుడిలా వ్యవహరిస్తోందని బిజెపి నేత, కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఆరోపించారు. గత నాలుగేళ్లలో రాష్ట్రంలో మహిళలపై మొత్తం 1.09 లక్షల నేరాలు నమోదయ్యాయని పేర్కొన్నారు. దేశంలో నమోదైన రేప్ కేసులలో 22 శాతం రాజస్థాన్ నుండే ఉన్నాయని ధ్వజమెత్తారు.
వీటికి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బాధ్యత వహించి, వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై కేబినెట్ లోని మంత్రి విమర్శలు చేశారని, కానీ సొంత పార్టీ నేత విమర్శలు చేయడంతో బర్తరఫ్ చేశారని గుర్తు చేశారు. అయితే, సొంత మంత్రి రాజేంద్ర సింగ్ గుడా చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు.
నేరస్థులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా గళం విప్పినందుకు మంత్రిని తొలగించారని ఆయన విమర్శించారు. మహిళలపై జరుగుతున్న నేరాల నియంత్రణకు రాజస్థాన్ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. మహిళలపై నేరాల్లో రాజస్థాన్ నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందని దుయ్యబట్టారు.
దేశంలో పలు రాష్ట్రాల్లో మహిళలపై ఘోరాలు జరిగాయని, బెగుసరాయ్ లో జరిగిన ఘటన మనముందు ఉందని చెబుతూ దీనిపై నితీష్ కుమార్ ఒక్క మాట మాట్లాడలేదని విస్మయం వ్యక్తం చేశారు.
“మహిళలకు వ్యతిరేకంగా జరిగే నేరం ఏదైనా నేరమే. ఆగ్రహావేశాలు ఏ ప్రభుత్వం అమలులో ఉందనే దానిపై అధారపడి ఉండదు. రాష్ట్రాలతో సంబధం లేకుండా ఇటీవల ఇటువంటి నేరాలు నివేదించబడిన బెంగాల్, బీహార్, రాజస్థాన్‌లకు ఈ నేరాలకు పాల్పడే బృందాలను పంపుతారా?” అని ఆయన ప్రతిపక్షాలను నిలదీశారు.
రాజస్థాన్‌లో మహిళపై లైంగిక నేరాలకు సంబంధించి రాజస్థాన్ మంత్రి శాంతి ధరివాల్ వ్యాఖ్యలపై సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారు? అని ఠాకూర్ ప్రశ్నించారు.
More Stories
సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ దోషి
అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి కన్నుమూత
2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి