యూపీయే హయాంలోఫోన్ బ్యాంకింగ్ స్కాం

యూపీయే ప్రభుత్వ హయాంలో చాలా కుంభకోణాలు జరిగాయని, వాటిలో ఒకటి ఫోన్ బ్యాంకింగ్ కుంభకోణమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ఓ కుటుంబానికి సన్నిహితంగా మెలిగే వ్యక్తులు బ్యాంకులకు ఫోన్ చేసి, వేల కోట్ల రూపాయల రుణాలను పొందేవారని, ఆ రుణాలు తిరిగి చెల్లించేవారు కాదని ధ్వజమెత్తారు.

శనివారం ఆయన కొత్తగా నియమితులైన దాదాపు 70 వేల మందికి వర్చువల్ విధానంలో నియామక పత్రాలను అందజేస్తూ పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ కల దేశాల్లో భారతదేశం ఒకటని చెప్పారు. అయితే, గత యూపీయే ప్రభుత్వంలో మన దేశ బ్యాంకింగ్ రంగం ధ్వంసమైందని ఆరోపించారు.  నేడు మనం డిజిటల్ లావాదేవీలను చేయగలుగుతున్నామని, తొమ్మిదేళ్ల క్రితం ఫోన్ బ్యాంకింగ్ దేశ ప్రజలకు అందుబాటులో ఉండేది కాదని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ నష్టాల్లో ఉండేవని, వేల కోట్ల రూపాయలు నష్టపోతూ ఉండేవని, నిరర్థక ఆస్తులు ఉండేవని విమర్శించారు. 

ఎన్డీయే ప్రభుత్వం అధికారం లోకి వచ్చాకనే బ్యాంకులు మళ్లీ కోలుకున్నాయని,  బ్యాంకింగ్ రంగంలో దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో ఇప్పుడు ఈ రంగం మరింత బలోపేతమైందని పేర్కొంటూ  ఇప్పుడు ఆ బ్యాంకులు రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జిస్తున్నాయని ప్రధాని చెప్పారు.  ప్రపంచానికి భారతదేశం పట్ల నమ్మకం పెరిగిందని, ఆకర్షక కేంద్రంగా భారత దేశం ఎదిగిందని చెబుతూ దీనిని మనం సంపూర్ణంగా వినియోగించుకోవాలని ప్రధాని మోదీ కోరారు. తన ప్రభుత్వం బ్యాంకులను పటిష్టం చేయడం కోసం అనేక చర్యలు చేపట్టిందని, చిన్న బ్యాంకులను విలీనం చేసిందని చెప్పారు. 

ఈ రంగానికి ప్రొఫెషనలిజాన్ని జోడించినట్లు తెలిపారు. ఈ చర్యల వల్ల బ్యాంకింగ్ రంగం బలోపేతమైందని పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగులు కఠోర శ్రమ చేస్తారని, ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధాని కొనియాడారు. ‘ముద్రా’ పథకం క్రింద పేదలు, అవ్యవస్థీకృత రంగాల్లోనివారికి రుణాలు ఇచ్చి, సహాయపడటంలో వీరు అంకితభావంతో పని చేస్తున్నారని మోదీ ప్రశంసించారు. 

అదేవిధంగా మహిళల స్వయం సహాయక బృందాలకు కూడా వీరు మద్దతిస్తున్నారని తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత అమృత కాలంలో ప్రభుత్వోద్యోగిగా సేవలందించే అవకాశం రావడం గొప్ప గౌరవమని ప్రధాన చెప్పారు. భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని భారతీయులు సంకల్పించారని తెలిపారు. 

మరికొన్ని సంవత్సరాల్లో ప్రపంచంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన మూడు దేశాల్లో భారత దేశం ఒకటి కాబోతోందని ప్రతి నిపుణుడు భావిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 44 చోట్ల శనివారం రోజ్‌గార్ మేళాలు జరిగాయి. కొత్తగా నియమితులైన ఉద్యోగులు వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్లలో పని చేస్తారు. 

యువత సాధికారులవడానికి, దేశాభివృద్ధిలో వారు భాగస్వాములవడానికి రోజ్‌గార్ మేళా ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఉపాధి సృష్టికి కూడా ఈ మేళా దోహదపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపింది.