మణిపూర్ వీడియోలపై సుప్రీం ఆగ్రహం

హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడానికి సంబంధించిన వీడియోలను సుమోటాగా పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఇందుకు బాధ్యులైన వారిపై తీసుకున్న చర్యలేమిటో తెలియచేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గురువారం ఆదేశించింది.

సోషల్ మీడియాలో బుధవారం ప్రత్యక్షమైన ఈ వీడియోలు తమను తీవ్రంగా కలచివేశాయని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. దీనిపై తమ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నామని, ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ధర్మాసనం పేర్కొంది. 

ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆమోదనీయం కాదని, జాతుల మధ్య ఘర్షణల్లో మహిళలను పావుగా ఉపయోగించుకోవడం ఏ విధంగానూ సమర్థనీయం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ వీడియో మే నెలకు చెందినదైనప్పటికీ దాంట్లో దాని వల్ల వచ్చే మార్పేమీ లేదని సిజెఐ పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి మరికొంత వ్యవధి ఇస్తామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే తామే ఉత్తర్వులు జారీచేస్తామని సిజెఐ చంద్రచూడ్ చెప్పారు.

 ఈ సంఘటనకు కారకులైనవారిని అదుపులోకి తీసుకోవడానికి తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చేపట్టిన చర్యలు వివరిస్తూ కేంద్ర, మణిపూర్ ప్రభుత్వాలు తమకు నివేదికలు అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను జులై 28వ తేదీకి వాయిదా వేసింది.

ఉభయ సభలు రేప‌టికి వాయిదా

పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజైన గురువారం మణిపూర్ హింసాకాండ, అమానవీయ ఘటనలపై నిరసనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. లోక్ సభ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సుశీల్ కుమార్ రింకూ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల దివంగతులైన సభ్యులకు నివాళులర్పించిన తర్వాత లోక్ సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. 
 
మణిపూర్ పరిస్థితిపై చర్చించాలని ప్రతిపక్షాలు గట్టిగా డిమాండ్ చేస్తూ, నినాదాలు చేశాయి. బీజేపీ నేత ప్రహ్లాద్ జోషీ మాట్లాడుతూ, సభా కార్యకలాపాలను శాంతియుతంగా నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్షాలను కోరారు. సభ పునః ప్రారంభమైన తర్వాత కూడా ప్రతిపక్షాలు మణిపూర్ అంశంపై చర్చించాలని నినాదాలు చేస్తుండడంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు. జూన్‌లో కన్నుమూసిన సిట్టింగ్ ఎంపీ హరిద్వార్ దూబేకు రాజ్యసభ నివాళులర్పించింది. అనంతరం సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటలకు సభ పునఃప్రారంభమైన తర్వాత ప్రతిపక్ష సభ్యులు లేచి సభా కార్యకలాపాలన్నిటినీ నిలిపేసి, మణిపూర్ హింసాకాండ గురించి చర్చించాలని పట్టుబట్టారు. ప్రధాని మోదీ సభకు రావాలని డిమాండ్ చేశారు. దీంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు.