కార్గిల్ దివస్‌ కు మహిళా సైనికుల మోటార్‌సైకిల్ ర్యాలీ

1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై విజయం సాధించి 24 ఏళ్లయిన సందర్భాన్ని స్మరించుకుని, మహిళల అసమాన స్ఫూర్తి చాటేందుకు దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం నుంచి ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారకం వరకు త్రివిధ దళాల ‘నారీ సశక్తికరణ్ మహిళా మోటార్‌సైకిల్ ర్యాలీ’ని భారత సైన్యం ప్రారంభించింది. 
 
ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ర్యాలీని ప్రారంభించారు. సైనికుల భార్యల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు శ్రీమతి అర్చన పాండే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీవీఎస్ మోటార్ కంపెనీ వ్యాపార ‍‌(ప్రీమియం) విభాగాధిపతి, ఇతర ప్రాయోజిత సంస్థల ప్రతినిధులు, సైనిక, పౌర ప్రముఖులు కూడా హాజరయ్యారు.
 
వేదిక వద్దకు పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలు ర్యాలీలో పాల్గొనే సభ్యులను ఉత్సాహపరిచారు. 25 మంది సభ్యుల త్రివిధ దళాల బృందంలో ఇద్దరు వీర్ నారీలు ఉన్నారు. వారిలో ఒకరు ఇప్పటికీ విధుల్లో ఉన్నారు.  10 మంది సైనిక మహిళా అధికారులు, భారత వైమానిక దళం & నౌకాదళం నుంచి ఒక్కొక్క మహిళా అధికారి, సైన్యం నుంచి ముగ్గురు మహిళా సైనికులు, ఎనిమిది మంది సాయుధ దళాల సిబ్బంది జీవిత భాగస్వాములు ర్యాలీలో పాల్గొంటున్నారు. 
 
కార్గిల్ యుద్ధంలో సాయుధ దళాల విజయాన్ని ఈ బృందం వేడుకలా జరుపుతుంది, దేశ సేవలో ప్రాణత్యాగం చేసిన సైనికులకు నివాళులు అర్పిస్తుంది. ఈ ర్యాలీ మొత్తం 1000 కిలోమీటర్ల దూరం సాగుతుంది. హరియాణా, పంజాబ్ మైదాన ప్రాంతాలు, జమ్ము&కశ్మీర్, లడఖ్‌లోని ఎత్తైన పర్వత మార్గాల గుండా యాత్ర సాగి, ఈ నెల 25న ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారకం వద్దకు చేరుకుంటుంది. 
 
ర్యాలీలో భాగంగా, ఎన్‌సీసీ క్యాడెట్‌లు, వివిధ పాఠశాలలు/కళాశాలల విద్యార్థులతో వీర్ నారీలతో బృంద సభ్యులు సంభాషిస్తారు. ఈ ర్యాలీ కోసం టీవీఎస్ మోటార్ కంపెనీతో భారత సైన్యం ఒప్పందం కుదుర్చుకుంది. ర్యాలీలో పాల్గొనేవాళ్లు టీవీఎస్‌ రోనిన్ మోటార్‌ సైకిళ్ల మీద ప్రయాణిస్తారు. సవాళ్లతో కూడిన ప్రయాణాన్ని చేపట్టినందుకు మొత్తం బృందాన్ని ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే అభినందించారు. దృఢ సంకల్పం, మహిళా శక్తి, జాతి నిర్మాణంలో మహిళలు పోషించే కీలక పాత్రను ఈ ర్యాలీ ప్రతిబింబిస్తుందని చెప్పారు.