ఇస్రో గగన్‌యాన్‌ మిషన్‌ సన్నాహాలు ముమ్మరం

ఇటీవల చంద్రయాన్‌-3 విజయవంతంగా నింగిలోకి పంపిన భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రస్తుతం ఈ మిషన్‌ను కొనసాగిస్తూనే గగన్‌యాన్‌ మిషన్‌ ఈ ప్రాజెక్టు కోసం సన్నాహాలు ముమ్మరంగా చేస్తున్నది.  ఇందులో భాగంగా మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్‌ రీసెర్చ్‌ కాంప్లెక్స్‌ (ఇపిఆర్ సి)లో గగన్‌యాన్ సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ (ఎస్ఎంపిఎస్)ని విజయవంతంగా పరీక్షించింది. ఈ విషయాన్ని ఇస్రో ట్విట్టర్‌ ద్వారా ప్రకటించింది.
గగన్‌యాన్‌ తొలి మిషన్‌ను ఆగస్టు చివరలో ప్రారంభించనున్నది.  అయితే, మానవరహిత మిషన్‌ వచ్చే ఏడాది ప్రారంభించనున్నది. ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (పిఆర్‌ఎల్)లో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఇస్రో చైర్మన్‌ సోమ్‌నాథ్‌ మాట్లాడుతూ గగన్‌యాన్‌ మిషన్‌ కోసం శ్రీహరికోటలో రాకెట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
క్రూ మాడ్యూల్‌, క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ అనుసంధానం ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా ఈ పనులు పూర్తి చేసి అన్ని పరీక్షలు పూర్తి చేస్తామని చెప్పారు.
 
చంద్రయాన్ 3 నాలుగో దశ కక్ష్య
 
ఇలా ఉండగా, ప్రస్తుతం భూమి కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్‌-3 త్వరలోనే చంద్రుడి వైపుగా పరుగులు తీయనున్నది. చంద్రయాన్ 3 కక్ష హెచ్చింపు ప్రక్రియలో నాలుగో దశను ఇస్రో గురువారం విజయవంతంగా నిర్వహించింది. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ,ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్క్ (ఇస్ట్రాక్) నుంచి ఈ సంబంధిత ఇంజిన్ల జ్వలనంతో ఈ ప్రక్రియ సజావుగా సాగింది.
దీనితో భూ కక్ష వీడుతూ ఇక చంద్రయాన్ 3 వ్యోమనౌక చంద్రుడి వైపు ప్రయాణంలో మరో అడుగు ముందకేసినట్లు అయింది. తరువాతి జ్వలన ప్రక్రియ ఈ నెల 25న మధ్యాహ్నం రెండు మూడు గంటల మధ్య నిర్వహిస్తారు. చంద్రుడివైపు పయనంలో ఓ అడుగు ముందుకేసి ఇస్రో ఇప్పుడు

అంతర్జాతీయ చంద్రుడి దినోత్సవంలో ప్రతీకాత్మకంగా పాల్గొందని ఇస్రో వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ మూడో దఫా ప్రక్రియ విజయవంతంతో చంద్రయాన్ 3 సజావుగా సాగుతున్నట్లు స్పష్టం అయింది. అంతకు ముందు స్పేస్ సైన్స్ టెక్నాలజీ అండ్ అవేర్‌నెస్ ట్రైనింగ్ (స్టార్ట్) కార్యక్రమంలో ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ మాట్లాడారు.

 చంద్రయాన్ సజావుగా సాగుతోందని, మరికొద్ది రోజుల్లో ఇది చంద్రుడిపై వాలుతుందని తెలిపారు. శాస్త్రీయ అంశాలకు సంబంధించి ఇస్రో చంద్రయాన్ 3 అత్యంత ప్రత్యేకమైన ఫలితాలను ప్రపంచానికి అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.