జైపూర్ లో 30 నిముషాల్లో మూడు సార్లు భూకంపాలు

వరుస భూకంపాలతో రాజస్థాన్​ జైపూర్​ ప్రజలు ఉలిక్కిపడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున ఆ ప్రాంతంలో అరగంట వ్యవధిలో భూమి మూడుసార్లు కంపించింది. అనేక ప్రాంతాల్లో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. మూడు భూకంపాలు కేవలం 30 నిమిషాల వ్యవధిలో సంభవించాయి.

శుక్రవారం తెల్లవారుజాము 4:09 గంటలకు భూమికి 10కి.మీల దిగువన మొదటి భూకంపం సంభవించింది. రిక్టార్​ స్కేల్​పై దీని తీవ్రత 4.4గా నమోదైంది. ఆ తర్వాత 4:22 గంటలకు భూమికి 5 కి.మీల దిగువన 3.4 తీవ్రతతో భూప్రకంపనలు వెలుగులోకి వచ్చాయి.  ఇక చివరిగా తెల్లవారుజామున 4:25 గంటలకు 3.4 తీవ్రతతో భూమికి 10 కి.మీల దిగువన భూమి కంపించింది. అప్పటికే ప్రజలు భయంతో పరుగులు తీశారు. జైపూర్​  భూకంపం తీవ్రత తక్కువగా ఉండటంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. 

ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరిగిందనే విషయంపై ప్రస్తుతం స్పష్టత లేదు. కాగా భూప్రకంపనలకు సంబంధించిన దృశ్యాలను ప్రజలు సోషల్​ మీడియాలో షేర్​ చేశారు. “జైపూర్​లోని చాలా ప్రాంతాల్లో భూప్రకంపనలు నమోదయ్యాయి. అందరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను,” అని రాజస్థాన్​ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ట్వీట్​ చేశారు.

మరోవంక, ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్ ​లో కూడా శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఉక్రుల్​ అనే ప్రాంతంలో 5:01 గంటలకు 3.5 తీవ్రతతో భూమి కంపించింది. ఈ విషయాన్ని నేషనల్​ సెంటర్​ ఫర్​ సీస్మోలాజీ వెల్లడించింది. కాగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగలేదని సమాచారం.