కైలాస పర్వతానికి భారత్ నుంచి కొత్త మార్గం

కైలాస పర్వతానికి భారత్ నుంచి కొత్త మార్గం త్వరలో ప్రారంభం కానుంది. ఈ సెప్టెంబర్ నుంచి ఈ మార్గంలో పర్యాటకులను, భక్తులను అనుమతించే అవకాశముంది. మహాదేవుడి నివాసంగా భక్తులు విశ్వసించే కైలాస పర్వతానికి భారత్ వైపు నుంచి ఒక మార్గాన్ని నిర్మిస్తున్నారు. భారత సైన్యానికి చెందిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బిఆర్ఓ) ఈ డైమండ్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టింది. 
 
వాతావరణం అనుకూలిస్తే, ఈ సెప్టెంబర్ నాటికి నిర్మాణం పూర్తవుతుందని, అప్పటి నుంచి భారత్ నుంచి భక్తులు, పర్యాటకులు పవిత్ర కైలాస పర్వతానికి వెళ్లవచ్చని బీఆర్ఓ చీఫ్ ఇంజనీర్ విమల్ గోస్వామి వెల్లడించారు. ఉత్తరాఖండ్ లోని పితోడ్ గఢ్ జిల్లాలో ఉన్న నభిధాంగ్ కేఎంవీఎన్ హట్స్ నుంచి సుమారు 7 కిమీల దూరంలోని భారత, చైనా సరిహద్దుల్లో ఉన్న లిపులేఖ్ పాస్ వరకు ఈ రోడ్డు నిర్మాణం ఉంటుంది. 
 
కఠినమైన భౌగోళిక, వాతావరణ పరిస్థితుల మధ్య ఈ నిర్మాణం సాగుతోంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత, ఆ రోడ్డు మార్గం పొడవునా ‘కైలాశ్ వ్యూ పాయింట్’ ను కూడా సిద్ధం చేయనున్నారు. ఈ ‘కైలాశ్ వ్యూ పాయింట్’ ప్రాజెక్టును భారత ప్రభుత్వం హైరాక్ ప్రాజెక్ట్స్ సంస్థకు అప్పగించింది.  లిపులేఖ్ పాస్ ద్వారా గతంలో కైలాశ్ – మానస సరోవర్ యాత్ర ఉండేది. కోవిడ్ మహమ్మారి సమయంలో ఆ యాత్రను రద్దు చేశారు. ఆ తరువాత మళ్లీ పునరుద్ధరించలేదు.
ఆ రూట్లో యాత్ర‌ను నిలిపివేయ‌డం వ‌ల్ల భార‌త ప్ర‌భుత్వం ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అన్వేషించింది. దీనిలో భాగంగానే కైలాస్ వ్యూవ్ పాయిట్ రోడ్డును డెవ‌ల‌ప్ చేస్తున్నారు. కైలాస పర్వతం సముద్ర మట్టానికి 6,638 అడుగుల ఎత్తులో ఉంటుంది. టిబెట్ పీఠభూమిలోని పశ్చిమ ప్రాంతంలో ట్రాన్స్ హిమాలయ రీజియన్ లో ఉన్న కైలాస్ రేంజ్ పర్వతాల్లో ఇది ఒకటి.