24 గంటల్లో మరో అల్పపీడనం

దేశవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే రెండు రోజుల్లో ఒడిశాలోని పశ్చిమ-వాయవ్య దిశగా కదలనుంది. ఈ నెల 24న వాయవ్యం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. 

దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మధ్య భారతదేశంలో వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు కురవనుండగా, పశ్చిమ భారతదేశంలోని కొంకణ్‌, గోవా, మధ్య మహారాష్ట్రలోని ఘాట్‌ ప్రాంతాలు, గుజరాత్‌లలో వచ్చే ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశంముందని తెలిపింది.

దక్షిణ భారతదేశం, ఈశాన్య భారతదేశంలో భారీ వర్షాలు, తూర్పు భారతదేశంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.  ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నందున మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 

కోస్తాంధ్ర – ఒడిశాను ఆనుకుని అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్‌, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈనెల 25 వరకు మోస్తరు నుంచి విస్తారంగా జల్లులు కరిసే అవకాశం ఉందని వివరించింది.

 తెలంగాణాలో వచ్చే మూడు రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నెల 26 వరకు కొన్ని ప్రాంతాలో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.