అధిక వర్షాల వల్ల పెరగనున్న కూరగాయల ధరలు

గతంలో ఎన్నడూ లేని విధంగా టమాటా ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. పలు ప్రాంతాల్లో అయితే కేజీ ధర రికార్డు స్థాయిలో రూ. 250 పలికింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రూ. 120 వరకు పలుకుతున్న టమాటా ధర, ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే రూ. 200 పైగా ఉంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్ గంగోత్రిలో ఇటీవల టమాటా ధర రూ. 200 నుంచి రూ. 250కి చేరింది.

రానున్న రోజుల్లో టమాటా ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటు క్యాబేజీ, కాలిఫ్లవర్, క్యాప్సికం ధరలు కూడా పెరగవచ్చని  విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే టమాటా ధరలు ఇప్పట్లో తగ్గే సూచనలు కన్పించడం లేదు. సామాన్యులపై మరింత భారం పడనుంది. వంటింట్లోకి టమాటాను తీసుకురావాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది.

హిమాచల్ ప్రదేశ్ సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా పడుతున్నా యి. ఫలితంగా టమాటా సాగు చేయడానికి, సరఫరాకు తీవ్ర ఇబ్బందులు ఎదరవుతున్నాయి. కర్ణాటకలో టమాటా దిగుబడి అధికంగా ఉండటంతో ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచే సరఫరా అవుతోంది.

ఉత్తరాది రాష్ట్రాలు ప్రత్యేకించి హిమాచల్ ప్రదేశ్ లో రికార్డు స్థాయిలో నమోదవుతున్న వర్షపాతం వల్ల టమాటా తో పాటు క్యాబేజీ, కాలీఫ్లవర్, దోస, ఆకు కూరల ధరలు రానున్న రోజుల్లో భారీగా పెరిగే అవకాశం ఉందని, వర్షపు నీటి వల్ల వైరస్ లతో పాటు ఇతర కారణాల వల్ల కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతింటాయని ఫలితంగా దిగుబడి తగ్గి ధరలు పెరుగుతాయని బెంగళూరులోని హార్టికల్చర్ రీసెర్చ్ డైరెక్టర్ ఒకరు తెలిపారు.

క్యాబేజీ, కాలిఫ్లవర్, క్యాప్సికంకు హిమాచల్ ప్రదేశ్ ప్రత్యేకం. దేశ రాజధాని ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచే ఈ కూరగాయాలు సరఫరా అవుతాయి. ఇప్పుడు అక్కడ అధిక వర్షాలు పడుతుండటంతో దిగుబడి తగ్గి కూరగాయల ధరలు ఇంకా పెరుగుతాయన్నారు. ధరలు విపరీతంగా పెరిగితే సామాన్య ప్రజలు పప్పుల వైపు చూస్తారని పేర్కొన్నారు. 

ఇప్పటికే ఎక్కువగా ఉన్న పప్పుల ధరలు అప్పుడు ఇంకా పెరిగే అవకాశముందని చెబుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ తో పాటు రాజస్థాన్, ఉత్తరాఖండ్, హర్యానా, జమ్ముకశ్మీర్ లో గతవారం అధిక వర్షపాతం నమోదైంది. ఫలితంగా పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో రానున్న రోజుల్లో టమాటాతో పాటు కూరగాయలు ధరల భారం ప్రజలపై పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

దేశంలో విపరీతంగా పెరుగుతోన్న టమాటా ధరలు ఆందోళన కలిగిస్తున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) తన మాస బులిటెన్‌లో పేర్కొంది. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతోన్న టమాటా ధరల వల్ల ద్రవ్యోల్బణం ఎగిసిపడొచ్చని పేర్కొంది. టమాటా ధరల పెరుగుదల నుండి ఇతర వస్తువుల ధరలు హెచ్చు కావడంతో ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం సవాల్‌గా మారొచ్చని పేర్కొంది.