విపక్షాల భేటీ “అది అవినీతి దుకాణం..’’

బెంగళూరులో సమావేశమైన పార్టీల ఏకైక మంత్రం ‘కుటుంబం కోసం.. కుటుంబం చేత..’ అని, సొంత కుటుంబం ప్రయోజనాల కోసమే అవి రాజకీయాలు చేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. అండమాన్ నికోబార్ లోని పోర్ట్ బ్లయర్ లో ఉన్న వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ను ప్రధాని మోదీ వర్చువల్ ప్రారంభిస్తూ విపక్షాల సమావేశంపై విరుచుకుపడ్డారు. 

దేశం నాశనం కావడానికి కారణమైన పార్టీలన్నీ మరోసారి ఏకమవుతున్నాయని ఆయన మండిపడ్డారు. వారి మాయలో పడవద్దని ప్రజలకు సూచించారు. 2024 లో గెలవడం కోసం 26 పార్టీలు కలుస్తున్నాయని, కానీ వారిది అవినీతి దుకాణమని, అందులో ప్రొడక్ట్ ఒకటి, లేబుల్ మరొకటి ఉంటుందని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. 

వారి దుకాణంలో కులతత్వమనే, అవినీతి అనే విషాన్ని అమ్ముతారని విమర్శించారు. విపక్ష కూటమిని అత్యంత అవినీతిమయమైన కూటమిగా ప్రజలు భావిస్తున్నారని మోదీ ధ్వజమెత్తారు. భారత దేశ దుఃఖానికి బాధ్యులైనవారు ఇప్పుడు తమ దుకాణాలను తెరిచారని చెప్పారు. అయితే, 2024 లో మళ్లీ ఎన్డీయేకే పట్టం కట్టాలని భారత దేశ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని ప్రధాని మోదీ భరోసా వ్యక్తం చేశారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ‘‘ఇది కట్టర్ అవినీతి సమ్మేళనమని ప్రజలు అంటున్నారు. ఈ సమావేశానికిగల మరొక ప్రత్యేకత ఏమిటంటే, కోట్లాది రూపాయల అవినీతి కేసులో బెయిలు మీద బయట ఉన్నవారిని ఎంతో గౌరవంతో చూస్తున్నారు. మొత్తం కుటుంబ సభ్యులంతా బెయిలు మీద ఉంటే, మరింత ఎక్కువగా గౌరవిస్తున్నారు. ఓ జన సముదాయాన్ని అవమానించినందుకు కోర్టు శిక్షిస్తే, అలా శిక్ష పొందినవారిని గౌరవిస్తున్నారు’’ అని మోదీ ఎద్దేవా చేశారు. 

పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత జరిగిన హింసాకాండను ప్రస్తావిస్తూ, బెంగళూరు సమావేశంలో పాల్గొన్న ప్రతిపక్ష నేతలను వారిపై వచ్చిన అవినీతి ఆరోపణల గురించి అడిగినపుడు, వారు మౌనంగా ఉన్నారని ప్రధాని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలు జరిగాయని, దీనిపై వీరంతా మౌనాన్ని ఆశ్రయించారని చెప్పారు.
 
తమను కాపాడాలని కాంగ్రెస్, వామపక్షాల కార్యకర్తలు వేడుకున్నప్పటికీ, వారి నేతలు మాత్రం స్వార్థపూరిత రాజకీయాలకోసం వారిని దయనీయ పరిస్థితుల్లో వదిలేశారని మోదీ గుర్తు చేశారు. తమిళనాడులో అవినీతి కేసులు చాలా ఉన్నాయని చెబుతూ ఈ కేసులు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయని, అయితే నిందితులకు ప్రతిపక్ష నేతలు క్లీన్ చిట్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.

అందరినీ కలుపుకొనిపోతూ, అందరికీ అవకాశాలు లభించే సరికొత్త అభివృద్ధి నమూనాకు తాను కట్టుబడి ఉన్నానని మరోసారి మోదీ తెలిపారు. తన ప్రభుత్వ హయాంలో ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, అండమాన్ అండ్ నికోబార్ దీవులు అభివృద్ధి చెందినట్లు చెప్పారు.