ఐదేళ్లలో 13.5 కోట్ల మంది పేదరికం నుండి బైటకు

భారతదేశంలో ఐదేళ్ల కాలంలో 13.5 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్‌లలో పేదరికం అత్యంత వేగంగా తగ్గుతోందని తెలిపింది ‘జాతీయ బహుళకోన పేదరిక సూచీ(ఎంపీఐ): 2023’ పేరిట నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బెరీ సోమవారం ఈ నివేదికను విడుదల చేశారు. 
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019-21) వివరాల ఆధారంగా దీన్ని రూపొందించారు. ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు లాంటి అంశాల్లోని పోషకాహారం, శిశు మరణాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, బ్యాంక్ ఖాతాలు వంటి 12 సూచికలను పరిగణలోకి తీసుకున్నారు. ఎంపీఐ రెండవ ఎడిషన్ ప్రకారం భారతదేశం బహుమితీయ పేదల సంఖ్య 2015-16లో 24.85 శాతం నుంచి 2019-2021లో 14.96 శాతానికి తగ్గింది. 

9.89 శాతం పాయింట్ల గణనీయమైన క్షీణతను నమోదు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 32.59 శాతం నుంచి 19.28 శాతానికి వేగంగా క్షీణించగా, పట్టణ ప్రాంతాల్లో పేదరికం 8.65 శాతం నుంచి 5.27 శాతానికి తగ్గింది. “2015-16, 2019-21 మధ్యకాలంలో రికార్డు స్థాయిలో 13.5 కోట్ల మంది ప్రజలు బహుమితీయ పేదరికం నుంచి బయటపడ్డారు” అని నీతి ఆయోగ్ వైస్-ఛైర్మెన్ సుమన్ బేరీ విడుదల చేసిన ‘నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్: ఎ ప్రోగ్రెస్ రివ్యూ 2023’ నివేదిక పేర్కొంది.

మొత్తం 12 సూచికలలో గణనీయమైన మెరుగుదల కనిపించింది. నీతి ఆయోగ్ తన సాంకేతిక భాగస్వాములు — ఆక్స్‌ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్ (ఓపీహెచ్ఐ), యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (యు ఎన్ డి పి) అభివృద్ధి చేసిన ఆల్కైర్-ఫోస్టర్ మెథడాలజీని ఈ నివేదిక అనుసరిస్తుందని పేర్కొంది.
యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌లో  యు ఎన్ డి పి, ఓపీహెచ్ఐ విడుదల చేసిన గ్లోబల్  ఎంపీఐ తాజా నవీకరణ ప్రకారం 2005/2006 నుంచి 2019/2021 వరకు కేవలం 15 సంవత్సరాలలో భారతదేశంలో మొత్తం 415 మిలియన్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. పారిశుధ్యం, పోషకాహారం, వంట ఇంధనం, ఆర్థిక సమ్మేళనం, తాగునీరు, విద్యుత్‌ను మెరుగుపరచడంపై ప్రభుత్వం అంకితభావంతో దృష్టి సారించడమే పేదరికం తగ్గుదలకు కారణమని నీతి నివేదిక పేర్కొంది. 
 
ఎంపీఐ  మొత్తం 12 పారామీటర్‌లు గుర్తించదగిన మెరుగుదలలను చూపించాయి. 2015-16, 2019-21 మధ్య, MPI విలువ 0.117 నుంచి 0.066కి దాదాపు సగానికి తగ్గింది. పేదరికం తీవ్రత 47 శాతం నుంచి 44 శాతానికి తగ్గింది. భారతదేశం 2030 నాటి నిర్ణీత కాలక్రమం కంటే చాలా ముందుగానే ఎస్ డి జి టార్గెట్ 1.2 (బహుళ డైమెన్షనల్ పేదరికాన్ని కనీసం సగానికి తగ్గించడం) సాధించే మార్గంలో ఉందని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం వివరించారు.

 
పోషణ్ అభియాన్, రక్తహీనత ముక్త్ భారత్ వంటి పథకాలు ఆరోగ్యంలో లేమిని తగ్గించడానికి దోహదపడ్డాయని నివేదిక పేర్కొంది. స్వచ్ఛ భారత్ మిషన్, జల్ జీవన్ మిషన్ వంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా పారిశుధ్యాన్ని మెరుగుపరిచాయి. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పిఎంయువై) ద్వారా సబ్సిడీతో కూడిన వంట ఇంధనాన్ని అందించడం వల్ల జీవితాల్లో సానుకూల మార్పులు వచ్చాయి.
 
వంట ఇంధనం కొరతలో 14.6 శాతం పాయింట్లు మెరుగుపడ్డాయి. సౌభాగ్య, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పిఎంఎవై), ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పిఎంజెడివై), సమగ్ర శిక్ష వంటి కార్యక్రమాలు కూడా దేశంలో బహుమితీయ పేదరికాన్ని గణనీయంగా తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషించాయని నివేదిక పేర్కొంది.