బెంగుళూరులో విపక్ష నేతల భేటీ తీర్మానాలకేనా!

డా. వడ్డీ విజయ సారధి,
ప్రముఖ సంపాదకులు, రచయిత

ఈరోజు సాయంత్రం నుండి బెంగుళూరులో విపక్ష నేతల సమావేశం కాంగ్రెస్ పార్టీ ఆతిథ్యంలో జరుగబోతున్నది. వారు ఏయే విషయాలపై ఏకీభావం సాధించగలరని కొందరు ఆసక్తిగా ఎదురు చూస్తుండవచ్చు.

కేంద్ర పాలిత ప్రాంతాల్లో సేవలందిస్తున్న ఐఏఎస్ అధికారులను బదిలీ చేసే అధికారం డిల్లీ ప్రాంతీయ ప్రభుత్వానికి నిరాకరిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్సును నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తున్న వైఖరితో పార్లమెంటులో ఉండగలనని కాంగ్రెసు ఇప్పుడే స్పష్టం చేయాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ ను కాంగ్రెసు ఆమోదించింది. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ పాల్గొనడం గురించిన సందేహాలు తొలగిపోయాయి.

కాబట్టి సమావేశానికి ఆహ్వానించినబడిన 24 పార్టీలలో ఇంచుమించుగా అన్నిపార్టీలవారూ పాల్గొనవచ్చు. వీరందరూ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా, ఎన్డీఏలను  రాబోయే ఎన్నికల్లో ఓడించాలని ప్రజానీకాన్ని కోరుతూ తీర్మానించవచ్చు. అంతకు మించి వారి ఆలోచనలు ఏమేరకు ముందుకు సాగుతాయన్నదే అసలు ప్రశ్న.

ఈ ప్రశ్నను రెండు భాగాలుగా విభజించి పరిశీలించవచ్చు.

1. లోకసభ ఎన్నికల్లో అందరూ కలిసి ఒక నియోజకవర్గం లో ఈ కూటమి తరపున ఒక అభ్యర్థి మాత్రమే ఉండేటట్లుగా అవగాహన కుదుర్చుకుని పోటీచేయాలా?

2. ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరిని ముందుకు తీసుకొని వచ్చి నిలబెట్టాలి?

ఈరెండు ప్రశ్నలూ ఏకాభిప్రాయసాధనకు లొంగనివే. అయినా సూత్రప్రాయంగా ఒక అంగీకారం కుదిరినట్లయితే, అప్పుడు అనేక ఉపప్రశ్నలు తలఎత్తుతాయి. వాటికి సమాధానాలు వెదుక వలసి ఉంటుంది.

1. ఏనియోజకవర్గంలో ఎవరు పోటీచేయాలో అక్కడ ఘర్షణపడే రెండుమూడు పార్టీలవారు అవగాహనకువస్తే సరిపోతుందా? లేక దేశవ్యాప్తంగా అన్ని పార్టీల వారికి సమన్యాయం, వారి బలానికి తగిన అవకాశాలు లభించేలా  చూడడానికి ఒక అఖిల భారత సమన్వయ సమితి ఏర్పడి, ఆమోదముద్ర వేయటం అవసరమా? అవసరమనుకుంటే, ఎంత మందితో (ఏయే పార్టీల ప్రాతినిధ్యంతో) ఏర్పరచాలి?

2. కేరళ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, పంజాబ్, డిల్లీ…వంటి రాష్ట్రాల్లో సమన్వయ బాధ్యతలను ఎవరికి అప్పగించాలి? సిపిఎం, తృణమూల్  కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, ఆర్జేడీ, జేఎంఎం, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి పార్టీలకు ఈ బాధ్యతను అప్పగించడానికి కాంగ్రెసు సిద్ధపడుతుందా? కాదంటే, కాంగ్రెసుకు అప్పగించడానికి పై పార్టీలే సిద్ధ పడుతాయా?

3. మొన్న కర్ణాటకలో అనుసరించిన విధానం కూడా పరిశీలించవలసి ఉంది. ఒక రాష్ట్రంలో ముప్పై నియోజకవర్గాలు ఉన్నాయనుకుందాం. ఆ రాష్ట్రంలోని ఐదారు పార్టీలు సర్దుబాట్లు చేసుకొని వేరువేరు గుర్తులతో పోటీచేయడానికి బదులుగా, ఒక పార్టీయే అన్ని స్థానాలకు పోటీ చేసినప్పుడే బిజెపిని దీటుగా ఎదుర్కోగలము, కాబట్టి ఒక రాష్ట్రంలో ఒక పార్టీ మాత్రమే పోటీ చేయాలి, అనే ప్రతిపాదన చర్చకు వస్తే, ఎలాంటి నిర్ణయం జరుగుతుందో చూడవలసి ఉంది.

4. ఒక రాష్ట్రంలో కూటమి నుండి ఒకే పార్టీ అభ్యర్థులు పోటీ చేయటమంటే, ఆ స్థానాల్లో కొన్నింటిని ఐనా ఎన్డీయే కి పళ్లెంలో పెట్టి అప్పగించడమే అవుతుంది. ప్రజలు ఈ కూటమి అభ్యర్థులను తిరస్కరించి బిజేపి/ఎన్డీయే అభ్యర్థులను కొన్నిచోట్ల యినా గెలిపించడానికి అవకాశమిచ్చి నట్లవుతుంది.

ఉదా: కేరళ. పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థికి మిగిలిన అన్ని పార్టీలవారి వోట్లు బదిలీ అవుతాయని ఖాయంగా చెప్పలేము. ఒకరికంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేసి ఒకరినొకరు ఘాటుగా విమర్శించుకొంటేనే, వారిలో ఎవరో ఒకరు గెలిచే అవకాశముంటుంది. బిజేపి ముందుకు చొచ్చుకు రాకుండా నిరోధించడానికి ఈ మార్గమే సరైనది అనే వాదానికి ఎవరెవరు ఎలా స్పందిస్తారో చూడవలసిఉంది

5. వచ్చేవారు మేధావులు, అనుభవజ్ఞులు కాబట్టి ఇంకా ఎన్నో రకాల ప్రతిపాదనలు చర్చకు వస్తాయి. వాటిలో నుండి ఏవేవి ఆమోదానికి నోచుకుంటాయో చూడవలసి ఉంది. నిధుల సేకరణ ఎలాజరగాలి? వినియోగం ఎలా జరగాలి? వంటి ప్రశ్నలు సమావేశంలో బాహాటంగా చర్చించబడకపోయినా, స్కంధావారంలో చర్చలు జరుగవచ్చు, అవగాహనలు కుదరవచ్చు.

6. అందరి ఖర్చులూ తానేభరిస్తానని చెప్పిన తెలంగాణ పక్ష నేత ఈ సమావేశానికి ఆహ్వానించబడలేదు. ఆయనగాని, ఆయన లాంటి మరొకరేగాని సమావేశంలో ఉంటే, “కాంగ్రెసు ఏమేరకు జనామోదం సంపాదించ గలదు? కాంగ్రెసును వెంటబెట్టుకుని పోటీలో దిగటమంటే, పరాజయ, పరాభవాలను ఆహ్వానించటమే కదా?” అన్న విషయమూ చర్చకు పెట్టవచ్చు. మరి ఇది కాంగ్రెసు ఆతిథ్యంలో జరుగుతున్న సమావేశం కాబట్టి ఆ సందేహం తొలగిపోయిన తర్వాతనే వారు హాజరవు తున్నారని, ఈవిషయంలో వారికి ఏవిధమైన శషబిషలూ లేవని అనుకోవాల్సి ఉంటుంది.

7. పార్టీల విషయంగా ఆలోచించినప్పుడు లేవనెత్తిన సందేహాలే, ప్రధానమంత్రి అభ్యర్థి ఎంపిక గురించిన సందర్భంలోనూ తలెత్తుతాయి. మరి వాటికి సమాధానాలు ఇప్పుడే వెదుకుతున్నారా? లేక ఆ అంశాన్ని ముందుముందు జరుగబోయే సమావేశాలకు వాయిదా వేసి త్రేన్చుకుంటూ ఇప్పటికి గృహోన్ముఖులవుతారా?

వోటర్ల ప్రశ్నలకు సమాధానాలు దొరికినా, దొరకకపోయినా, పత్రిక వారికి కావలసినంత మసాలా పంచిపెట్టే విధంగా ఈ సమావేశం దిగ్విజయం కాగలదని అనుకోవచ్చు.