విద్య అత్యంత శక్తివంతమైన ఆయుధం

విద్య అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధమని దృఢంగా విశ్వసిస్తున్నానని, ఇది మనకు శక్తినిస్తుందని, మన ఆలోచనలను ఆకృతి చేస్తుందని, ఉజ్వల భవిష్యత్తును సృష్టించడానికి, ప్రపంచాన్ని మార్చడానికి సాధనాలతో మనల్ని సిద్ధం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ తెలిపారు.
శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో 21వ స్నాతకోత్సవంకు సోమవారం  కులపతి హోదాలో అధ్యక్షత వహిస్తూ ఈరోజు మీరు మీ డిగ్రీలను స్వీకరిస్తున్నప్పుడు, ఇది మీ అభ్యాస ప్రయాణానికి ముగింపు కాదని, జ్ఞానం కోసం జీవితకాల అన్వేషణకు నాంది అని గుర్తుంచుకోవాలని సూచించారు. 
 
ప్రపంచానికి మీ అభిరుచి, మీ సృజనాత్మకత,  మీ ప్రత్యేక దృక్పథం అవసరమని, మీ పనిలో ధైర్యంగా ఉండండి, పెద్ద కలలు కనే ధైర్యం చేయండి ఎల్లప్పుడూ మీ దృఢ సంకల్పంలో దృఢంగా ఉండాలని తెలిపారు. వైఫల్యాన్ని విజయానికి సోపానంగా స్వీకరిస్తూ రిస్క్ తీసుకోవడానికి ఎప్పుడూ భయపడకూడదని, నిజమైన విజయం వ్యక్తిగత విజయాల్లోనే కాదు, సమాజాభివృద్ధికి మీరు ఎలా దోహదపడతారో కూడా గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు.
 
శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకుంటున్న నేటి ముఖ్య అతిథి, వక్త డాక్టర్ మహంతేష్ జికె కి అభినందనలు తెలిపారు. క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా అధ్యక్షుడిగా, అతను దృష్టి లోపం ఉన్న యువ ఆటగాళ్లను క్రికెట్‌ను కెరీర్‌గా కొనసాగించమని ప్రోత్సహించాడని ప్రశంసించారు. దేశంలోని అంధుల క్రికెట్‌కు మరింతగా అభివృద్ధి చెందడానికి, మరింత గుర్తింపు పొందడానికి డాక్టర్ మహంతేష్ కృషి చేస్తున్నాడని గవర్నర్ కొనియాడారు.
 
విద్యార్థులు వృత్తిపరమైన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు సానుకూల మనస్తత్వంతో సవాళ్లను స్వీకరించాలని చెబుతూ ఎందుకంటే సవాళ్ల ద్వారానే మేము ఎదుగుతాము మరియు రాణిస్తామని తెలిపారు. ఆసక్తిగా ఉండండి, నేర్చుకోవడం మానేయకండి, మారుతున్న కాలానికి అనుగుణంగా మారడానికి సిద్ధంగా ఉండండని సూచించారు. 
 
ప్రతి ఒక్కరికి వైవిధ్యం కలిగించే శక్తి ఉందని పేర్కొంటూ మరింత న్యాయమైన, మరింత సమానమైన, మరింత సామరస్యపూర్వకమైన ప్రపంచాన్ని సృష్టించగల మీ సామర్థ్యంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. 

 
ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం 2020 భారతదేశం, భారతీయ ఉన్నత విద్యా వ్యవస్థలో కొత్త శకానికి నాంది పలుకుతుందని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు.  ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీలు దీనిని అనుసరించడానికి వేగంగా ముందుకు సాగుతున్నాయని చెబుతూ ఈ సంస్కరణలు తప్పనిసరిగా దేశ విద్యారంగంలో ఒక ప్రాథమిక మార్పును తీసుకువస్తాయని భరోసా వ్యక్తం చేశారు.
శ్రీ కృష్ణదేవరాయల యూనివర్సిటీలో 21వ స్నాతకోత్సవం సందర్భంగా ఎస్కేయూ పరిధిలో 2022 సంవత్సరంలో డిగ్రీలో పూర్తి చేసుకున్న 9,150 మందికి పట్టాలను అందజేశారు. పీజీ, ఎంఫిల్, పిహెచ్డి పూర్తి చేసిన 1,143 మందికి పట్టాలను అందజేశారు. పీజీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 57 మంది విద్యార్థులకు పథకాలు అందజేయగా, అందులో 39 బంగారు పతకాలు, 12 మెమోరియల్ ప్రైజ్ లు, 2 నగదు పురస్కారాలు, 4 యూనివర్సిటీ ప్రైజ్ లు అందజేయడం జరిగింది.