పాక్ లో 150 సంవత్సరాల హిందూ ఆలయం కూల్చివేత

* మరో దేవాలయంపై రాకెట్ లాంచర్ తో దాడి

పాకిస్థాన్‌ లో హిందువులు, హిందూ దేవాలయాలపై దాడులు నిత్య కృత్యంగా మారిపోతున్నది. 24 గంటల వ్యవధిలో రెండు దేవాలయాలపై దాడులు జరగడం కలకలం రేపుతోంది. కరాచీలో ఎన్నో 150కు పైగా సంవత్సరాల చరిత్ర ఉన్న హిందూ దేవాలయాన్ని బుల్డోజర్ తో శనివారం కూల్చివేస్తే, ఆ మరుసటి రోజే సింధ్ లో మరో దేవాలయంపై రాకెట్ లాంచర్ తో దాడి జరిపారు. ఈ ఘటనలతో పాక్‌లోని హిందూ సమాజం భయాందోళనకు గురవుతున్నది.  

కరాచీలోని సోల్జర్‌ బజార్‌లో మారిమాత ఆలయం ఉన్నది. దాదాపు 150 ఏళ్లకుపైగా చరిత్ర ఈ ఆలయానికి ఉన్నది.  అయితే, షాపింగ్‌ ప్లాజా నిర్మించేందుకు గత శుక్రవారం గుర్తు తెలియని బిల్డర్‌ ఆలయాన్ని కూల్చివేశారు. ఆలయ భూమిని షాపింగ్‌ ప్లాజా ప్రమోటర్‌కు రూ.7కోట్లకు విక్రయించినట్లు సమాచారం. ఈ ఆలయాన్ని పోలీసుల సమక్షంలో బూల్డోజర్ల సహాయంతో కూల్చివేసినట్లు తెలుస్తోంది.

ఈ దుర్ఘటన శనివారం జరుగగా, ఆ మరుసటి రోజే ఆదివారం ఉదయమే సింధు ప్రాంతంలోని ఒక హిందూ దేవాలయంపై కాష్మోర్ వద్ద రాకెట్ లాంచర్ తో దాడి జరిపారు. ఓ దోపిడీ దొంగల ముఠా ఆ దేవాలయంతో పాటు, పరిసర ప్రాంతాలలో ఉంటున్న హిందువుల ఇళ్లపై కూడా దాడులు జరిపారు. అక్కడకు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులు కూడా జరిపారు.  8-9 మంది వరకు దాడి జరిపారని, పోలీసులు వెంటపడటంతో వారు పారిపోయారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీస్ వర్గాలు తెలిపాయి. వారి వద్ద ఆయుధాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు.

కాగా, గతేడాది జూన్‌లో మారిమాత ఆలయంలోని దేవతా విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారని పంచ్‌ముఖి హనుమాన్‌ మందిర్‌ కేర్‌టేకర్‌ రామ్‌నాథ్‌ మిశ్రా మహారాజ్‌ తెలిపారు. ఆలయం కూల్చివేతకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని ఆయన పేర్కొన్నారు. ఆలయాన్ని కూల్చివేశారని, ప్రహరి, ప్రధాన ద్వారాన్ని వదిలేసి లోపలి నిర్మాణాన్ని కూల్చివేశారని పేర్కొన్నారు. 

ఈ ఆలయాన్ని దాదాపు 150 ఏళ్ల కిందట నిర్మించారని, దాని ప్రాంగణం కింద నిధి ఉన్నట్లు కథలు చెప్పుకునేవారని తెలిపారు. సుమారు 400-500 చదరపు గజాల విస్తీర్ణంలోని భూకబ్జాదారులు కన్నేశారని చెప్పారు. అయితే, ఆలయాన్ని ప్రమాదకరమైన కట్టడమని అధికారులు ప్రకటించడంతో కూల్చివేసినట్లు స్థానిక పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

ఈ ఆలయాన్ని కరాచీలోని మద్రాసీ హిందూ సమాజం నిర్వహిస్తోంది. ఆలయ నిర్మాణం చాలా పురాతనమైందని, ఆలయ నిర్వాహకులు అయిష్టంగానే తాత్కాలికంగా దేవతా విగ్రహాలను చిన్న గదిలోకి తరలించి, అక్కడ కొన్ని పునర్నిర్మాణ పనులు చేపట్టారని ఆయన తెలిపారు.  అయితే, ఆ స్థలంలో వాణిజ్య భవనాన్ని నిర్మించాలని భావించి నకిలీ పత్రాలతో భూమిని డెవలపర్‌కు కొందరు విక్రయించారు. దాంతో సదరు వ్యక్తుల ఆలయ భూమిని ఖాళీ చేయాలని సదరు వ్యక్తులు నిర్వాహకులపై ఒత్తిడి తెస్తున్నారని హిందూ సంఘం నేత రమేశ్‌ తెలిపారు. 

ఇక్కడి హిందూ సమాజం హిందూ కౌన్సిల్, సింధ్ ముఖ్యమంత్రి సయ్యద్ మురాద్ అలీ షా, సింధ్ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్ జనరల్‌కు విజ్ఞప్తి చేసినా పట్టించుకునేవారు కరువయ్యారు. పాకిస్తాన్‌లో హిందువులు అతిపెద్ద మైనారిటీ కమ్యూనిటీగా ఉన్నారు. పాకిస్తాన్ హిందూ జనాభాలో ఎక్కువ మంది సింధ్ ప్రావిన్స్‌లో స్థిరపడ్డారు.