వింబుల్డన్‌ విజేతగా స్పెయిన్‌కు చెందిన అల్కరాస్‌

ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో స్పెయిన్ కు చెందిన  కార్లోస్ అల్కరాజ్ సంచలన విజయం సాధించి, తొలి వింబుల్డన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు.  ‘అల్కరాజ్‌ టైటిల్స్‌ ఆకలితో ఉన్నాడు.. నేను కూడా సేమ్‌ టు సేమ్‌. ఫైనల్లో హోరాహోరీ తప్పదు. అభిమనులకు కన్నుల పండువే’ వింబుల్డన్‌ ఫైనల్‌కు ముందు సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ చేసిన వ్యాఖ్యలివి. 
 
ఈ మాటలు అక్షర సత్యాలని ఆదివారం నిరూపితమైంది. ప్రస్తుతం టెన్నిస్‌ ప్రపంచంలో అత్యుత్తమం అనదగ్గ ఇద్దరు స్టార్‌ ప్లేయర్లు ఆల్‌ ఇంగ్లండ్‌ కోర్ట్‌లో హోరాహోరీగా తలపడుతుంటే.. రెండు సింహాలు పోరాడినట్లు కనిపించింది. సెట్‌ సెట్‌కు ఆధిక్యం చేతులు మారిన పురుషుల సింగిల్స్‌ తుదిపోరులో చివరకు టాప్‌ సీడ్‌, ప్రపంచ నంబర్‌వన్‌ కార్లోస్‌ అల్కరాజ్‌ (స్పెయిన్‌) 1-6, 7-6 (8/6), 6-1, 3-6, 6-4తో రెండో సీడ్‌ జొకోవిచ్‌పై విజయం సాధించాడు. 
 
వరుసగా నాలుగుసార్లు వింబుల్డన్‌ టైటిల్‌ చేజిక్కించుకున్న జొకోవిచ్‌ పాంచ్‌ పటాకా మోగించాలనుకుంటే.. ఫైనల్లో అతడికి అనూహ్య పరాజయం ఎదురైంది. పురుషుల సింగిల్స్‌లో ఇప్పటికే 23 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గి 36 ఏండ్ల జొకోవిచ్‌ అగ్రస్థానంలో ఉంటే.. నిరుడు యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గి తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్న 20 ఏండ్ల అల్కరాజ్‌.. రెండో గ్రాండ్‌స్లామ్‌ ఖాతాలో వేసుకున్నాడు.

అల్కరాజ్‌, జొకోవిచ్‌ మధ్య పోరులో హోరాహోరీగా సాగింది. 4 గంటలా 42 నిమిషాల పాటు సాగిన వింబుల్డన్‌ ఫైనల్లో తొలి సెట్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన అల్కరాజ్‌, ఆ తర్వత జొకోకు చుక్కలు చూపాడు. ప్రస్తుత తరంలో తానెందుకు స్పెషలో చాటి చెప్పాడు.  తుదిపోరులో 9 ఏస్‌లు కొట్టిన అల్కరాజ్‌ 66 విన్నర్లు సాధిస్తే.. 2 ఏస్‌లకే పరిమితమైన జొకో 32 విన్నర్లు కొట్టాడు. చెరో 5 బ్రేక్‌ పాయింట్లు కాచుకోగా.. జొకోవిచ్‌ 40 అనవసర తప్పిదాలకు పాల్పడ్డాడు. ఫలితంగా గ్రాస్‌ కోర్ట్‌లో వరుసగా 34 విజయాలు సాధించిన జొకోవిచ్‌కు పరాజయం తప్పలేదు.

 టెన్నిస్‌లో ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న జొకోవిచ్‌తో తలపడుతున్నాననే బెరుకు లేకుండా.. అల్కరాజ్‌ తన అద్భుత విన్యాసాలతో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థిని తికమక పెడుతూ.. పదే పదే స్లో షాట్లతో నెట్‌ దగ్గర పాయింట్లు పట్టిన అల్కరాజ్‌.. తనకే అలవాటైన్‌ క్లిష్టమైన షాట్లతో పాటు గంటకు 210 కిలోమీటర్ల వేగంతో సర్వీస్‌ చేస్తూ అబ్బురపరిచాడు. అల్కరాజ్‌కు ఇది రెండో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. నిరుడు యూఎస్‌ ఓపెన్‌తో అల్కరాజ్‌ గ్రాండ్‌స్లామ్‌ ఖాతా తెరిచాడు.