హాలీవుడ్ లో కలకలం సృష్టిస్తున్న కృత్రిమ మేథ!

హాలీవుడ్ లో కలకలం సృష్టిస్తున్న కృత్రిమ మేథ!

ప్రపంచీకరణ, యాంత్రీకరణతో ఇప్పటికే అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. రోబోటిక్‌ యంత్రం వందమంది చేసే పని చేస్తుండటంతో నానాటికీ ఉపాధి అవకాశాలు మృగ్యమయ్యే ప్రమాద ఘంటికలు కన్పిస్తున్నాయి.  కృత్రిమ మేథ (ఎఐ), మెషిన్‌ లెర్నింగ్‌లు ఇప్పుడు విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్న క్రమంలో వాటి ప్రభావానికి గురై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతుంది. 

 తాజాగా హాలీవుడ్‌కు చెందిన సినిమా నటీనటులు, రచయితలలో కూడా తమ ఉపాధి అవకాశాలపై కలకలం రేపుతోంది. హాలీవుడ్‌లో ఎఐ హీరోలు, యాంకర్లు, న్యూస్‌రీడర్సు వచ్చిన నేపధ్యంలో ఎఐ వల్ల చిత్ర పరిశ్రమలోనూ పెనుమార్పు సంభవించే అవకాశం ఉందని అక్కడి కళాకారులు వాపోతున్నారు. 

అయితే ఏఐ వినియోగాన్ని తగ్గించాలన్న కళాకారుల డిమాండ్‌ను నిర్మాణ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. అలాగే నటీనటుల వేతనాలు పెంపునకు కూడా నిర్మాతలు సుముఖత వ్యక్తంచేయటంలేదు. ఈ నేపధ్యంలో నటీనటులు కూడా తమ డిమాండ్లను ఆమోదించే వరకూ సమ్మె కొనసాగించి తీరతామని స్పష్టం చేస్తున్నారు. 

చేసే పనికి గుర్తింపుతోపాటుగా గుర్తింపు, వేతనం, భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, తయారీ రంగాలను కృత్రిమ మేథ కుదిపేస్తోంది. తాజాగా ఎఐ దెబ్బకు హాలీవుడే అదిరి పడుతోంది. ఏఐ ప్రభావం అన్ని తరగతులపై పడుతుండడంతో పరిశ్రమలోని ప్రతీ క్రాఫ్ట్‌ సమ్మెకు మద్దతు పలకడంతో షూటింగ్‌లకు బ్రేక్‌ పడింది. 

ఏఐతో పొంచి ఉన్న ప్రమాదంతో పాటు తమ భవిష్యత్‌కు భద్రత కల్పించేలా చూడాలంటూ ది స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ సమ్మెకు దిగింది. దీంతో హాలీవుడ్‌లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఆగిపోయాయి. వేల కోట్ల బిజినెస్‌ జరిగే హాలీవుడ్‌లో ఏఐ పెట్టిన చిచ్చు మహా మహా నటులనే రోడ్డుపైకి వచ్చేలా చేసింది. 

సమ్మెకు ఏంజెలినా జోలీ, మెరిల్‌ స్ట్రీప్‌, ట్రామ్‌ క్రూజ్‌ వంటి హాలీవుడ్‌ దిగ్గజ స్టార్లు కూడా మద్దతు ఇస్తున్నారు. నిర్మాణ స్టూడియోలతో జరిగిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో నిరవధిక సమ్మెకు దిగారు. గురువారం అర్ధరాత్రి నుంచి జరుగుతున్న ఈ సమ్మెలో లక్షా 60 వేల మంది పాల్గొంటున్నారు.

1960లో హాలీవుడ్‌లో మొదటిసారి సమ్మె జరిగింది. తర్వాత 1980లో స్క్రీన్‌ యాక్టర్లు నిరసన తెలిపారు. మళ్లీ ఇన్నేళ్లకు రైటర్స్‌ గిల్డ్‌, స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ కలిసి సమ్మెకు పిలుపునివ్వడంతో 98 శాతం మంది సమ్మెకు మద్దతు పలికారు. దీంతో సినిమాతో పాటు వెబ్‌సిరీస్‌, టీవీ సీరియళ్లు ఆలస్యం కానున్నాయి. 

సమ్మె ఇలాగే కొనసాగితే సినిమాల విడుదలలు కూడా వాయిదా పడే అవకాశాలున్నాయి. ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమాల ప్రమోషన్లకు కూడా నటీనటులు దూరంగా ఉన్నారు. ఈ సమ్మె హాలీవుడ్‌ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఇప్పుడు కనుక తాము గళం విప్పకపోతే కష్టాల్లో పడకతప్పదని గిల్డ్‌ ప్రెసిడెంట్‌ ఫ్రాన్‌ డ్రెషర్‌ పేర్కొన్నారు. అత్యాశకు పోతున్న ఎఐ స్టూడియోల వల్ల తాము బాధితులమవుతున్నామని వాపోయారు.