అన్నవరంలో పూజారులకు వేలంపాటపై వివాదం

ప్రసిద్ధి చెందిన కాకినాడ జిల్లా అన్నవరంలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి ఆలయంలో పెళ్లిళ్లు, ఉపనయనాలు నిర్వహించేందుకు వేలం పాట ద్వారా పూజారులను తీసుకోవాలని ఆలయ ట్రస్ట్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ట్రస్ట్ బోర్డు  తీసుకున్న నిర్ణయాన్ని అర్చకులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. 
 
ఆలయ ప్రాంగణంలోని రత్నగిరి కొండల వద్ద ఉపనయనం, వివాహాలు చేసుకునేందుకు రూ.5వేలు రుసుము చెల్లించాలని ఇటీవల ఆలయ ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది.  ఈ మేరకు ఆలయ అధికారులు వివాహాలు చేసేందుకు కాంట్రాక్ట్ పద్ధతిలో వేలం ద్వారా పురోహితులను కేటాయిస్తారు. వివాహాలు చేసుకునేవారు రూ.5వేలు నగదును కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. 
 
అర్చకులు కాంట్రాక్టరు నుంచి ఈ డబ్బులను పొందుతారు. దీంతో ఉపనయనం, వివాహాలు చేసే అర్చకులు గణనీయంగా డబ్బు అందుతుందని ఆలయ ట్రస్ట్ బోర్డు భావిస్తోంది. అయితే పురోహితులు రెండు వర్గాలుగా చీలిపోయి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. 
 
ఈ మేరకు అర్చక సంఘాలు, బ్రాహ్మణ సంఘాలు, ఇతర ఆలయ సిబ్బంది నిరసనకు దిగి ఆలయ ఈవో చంద్రశేఖర్‌ ఆజాద్‌కు వినతిపత్రం అందించారు. దీంతో పురోహితుల వేలం ప్రక్రియను ఈవో తాత్కాలికంగా నిలిపివేశారు. అన్నవరం ఆలయ ప్రాంగణంలో వివాహాలు జరిపించుకునే వారి వద్ద దళారులు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. 
 
దీంతో దళారులను తొలగించాలనే ఉద్దేశంతో ట్రస్ట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని ఈవో వెల్లడించారు. పురోహితులు కాని కొందరు బ్రాహ్మణులు పురోహితులుగా వ్యవహరిస్తూ వివాహాలు చేస్తున్నారని.. ఇటీవల ఓ క్రైస్తవుడు గుడిలో పెళ్లి చేస్తూ కనిపించాడని.. ఆలయంలో మధ్యవర్తుల ప్రభావంతో పురోహితుడిగా వ్యవహరించారని ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా ఆలయంలో వివాహాలు జరింపించేందుకు రూ.5 వేల రుసుమును రద్దు చేయాలని బ్రాహ్మణ సంఘం నాయకులు ఈవోకు వినతిపత్రం అందజేశారు. దీంతో ఫీజును రూ.1500కు తగ్గించేందుకు ఈవో అంగీకరించారు. అయితే ఫీజు తగ్గింపు ప్రతిపాదనను తాము అంగీకరించడం లేదని ఆంధ్రప్రదేశ్ పురోహిత్ బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణరావు స్పష్టం చేశారు. 

ఆలయ ఫీజులను, కాంట్రాక్టర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం వివాహ పార్టీల నుండి రూ. 250 రుసుము తీసుకుంటున్నందున దళారీ వ్యవస్థను తొలగించే బాధ్యత ఆలయ ట్రస్ట్ బోర్డుపై ఉందని పేర్కొన్నారు. అన్నవరం పుణ్యక్షేత్రంలో వివాహాలు, ఇతర శుభకార్యాలు చేసుకుంటే ఫుణ్యఫలం అనేది భక్తుల నమ్మకం. అందుకే రత్నగిరి కొండపై ప్రతి ఏడాది వేల వివాహాలు, ఉపనయనాలు, వ్రతాలు, ఇతర శుభకార్యాలు జరుగుతుంటాయి. 

వీటి నిర్వహణలో పురోహితులు ప్రధాన భూమిక పోషిస్తారు. అయితే పురోహితులను బయట నుంచి తెచ్చుకుంటే వివాహానికి రూ.5వేలు, ఉపనయనాలకు రూ.2వేలు చెల్లించేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇదే తరహాలో పూర్తిస్థాయి సన్నాయి మేళం తెచ్చుకుంటే రూ.12వేలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఆలయ ట్రస్ట్ బోర్డు తీసుకున్న నిర్ణయం పూర్తిగా వ్యాపార దృక్పథంలో తీసుకున్నదేనని భక్తులు మండిపడుతున్నారు.