ఎన్డీయే భేటీకి పవన్ కు ఆహ్వానం, ప్రసక్తి లేని చంద్రబాబు

సుమారు ఐదేళ్ల తర్వాత ఈ నెల 18న జరుపుతున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే భేటీకి ఆంధ్ర ప్రదేశ్ నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం అందినట్లు తెలిసింది. పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల అనంతరం బిజెపితో పొత్తు ఏర్పర్చుకున్న తర్వాత మొదటిసారిగా ఎన్డీయే భేటీకి హాజరుకానున్నారు.
ఎన్డీయే నుండి వివిధ కారణాల చేత గతంలో వేరుపడిన కొన్ని పక్షాలను కూడా ఆహ్వానించే ప్రక్రియలో భాగంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును కూడా ఆహ్వానిస్తున్నట్లు కొద్దీ రోజులుగా జాతీయ మీడియాలో వస్తున్న కథనాలకు ముగింపు పలికినట్లయింది. చంద్రబాబుకు ఆహ్వానం పంపలేదని తెలుస్తున్నది. అయితే, తనతో పాటు తన పార్టీలో మరో కీలక నేత నాదెండ్ల మనోహర్ కు కూడా ఆహ్వానం పంపాలని పవన్ కళ్యాణ్ కోరిన్నట్లు చెబుతున్నారు.
 
పాత మిత్రపక్షమైన పంజాబ్ లోని ‘శిరోమణి అకాలీదళ్‌’కు కూడా ఆహ్వానం పంపినట్లు తెలిసింది. తెలంగాణ, కర్ణాటకలలో మాత్రం ఎవ్వరికీ ఆహ్వానం పంపినట్లు లేదు. తమిళనాడులో అన్నాడీఎంకే, తమిళ్‌మనీలా కాంగ్రెస్‌ నేత జీకే వాసన్‌, పీఎంకే నేత అన్భుమణి రాందాస్‌కు ఈ ఆహ్వానాలు అందాయి. అయితే అన్నాడీఎంకేకు చెందిన పన్నీర్‌ సెళ్వంకు మాత్రం బీజేపీ నుంచి ఆహ్వానం అందలేదు. 
 
బీహార్‌లో జనతాదళ్‌(యునైటెడ్‌) ఎన్డియే నుంచి దూరమైన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కొత్త మిత్రులను వెతుక్కునే క్రమంలో చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని లోక్‌జనశక్తి పార్టీతో పాటు ఆ రాష్ట్ర మాజీ సీఎం జితెన్‌ రామ్‌ మాంజీ (హందుస్తానీ ఆవామ్‌ మోర్చా)కు కూడా ఆహ్వానం పంపించారు.
 
మహారాష్ట్రంలో శివసేన ఎన్డియేకు దూరమైన తర్వాత ఆ పార్టీలో చీలికవర్గం ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేనతో కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ, తాజాగా ఎన్సీపీలోనూ అజిత్‌ పవార్‌ నేతృత్వంలో చీలిక వర్గాన్ని ప్రోత్సహంచి ప్రభుత్వంలో చేర్చుకుంది. 18 నాటి ఎన్డియే మిత్రపక్షాల భేటీకి ఈ రెండు చీలిక వర్గాలకు ఆహ్వానం పంపినట్లు తెలిసింది.