ఏపీలో ఉన్న పెట్టుబడులే తరలిపోతున్నాయి

ఏపీలో శాంతిభద్రతల పరిస్థితుల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో పరిశ్రమల స్ధాపనకు ప్రభుత్వం కృషి చేయడం లేదని, పెట్టుబడులు రాష్ట్రానికి రావడం లేదని, ఉన్నవి తరలిపోతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు.  పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా శుక్రవారం విజయవాడలో బాధ్యతలు చేపట్టిన ఆమె పరిశ్రమలు ఉంటే మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయని భావిస్తే, ఏపీలో పెట్టుబడులు వెనక్కి తీసుకుని వెళ్లే పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు.
ఇక్కడి పరిస్థితులకు భయపడి వెనక్కి తీసుకుని వేరే రాష్ట్రానికి వెళ్లాయని అంటూ జాకీ అలా వెళ్లిపోయిందని, 3వేల కోట్లు పెట్టుబడి కోయంబత్తూరుకు వెళ్లిందని ఆమె తెలిపారు. రాష్ట్రం సహకరిస్తేనే కేంద్రం ఏమైనా చేయగలుగుతుందని చెబుతూ వైజాగ్‌ చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసి, రూ. 4211కోట్ల ఖర్చుతో చెన్నై కారిడార్‌ అభివృద్ధి చేస్తున్నట్లు ఆమె చెప్పారు. విశాఖ,మదనపల్లి, శ్రీకాకుళం, కొప్పర్తిలో పారిశ్రామిక నోడ్స్ వస్తాయని చెబుతూ అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. భూసేకరణ రాష్ట్రమే చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఈ నెల 4న ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా నియమించగా, గురువారం ఉదయం హైదరాబాద్‌ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్ చేరుకున్న పురంధేశ్వరికి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తదితరులు  ఘన స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో గజమాలతో బీజేపీ నేతలు స్వాగతం చెప్పారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి భారీ ర్యాలీతో విజయవాడలోని పార్టీ కార్యాలయంపై చేరుకోగా, అక్కడ కూడా బాణాసంచాతో పురంధేశ్వరికి బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం ఏపీ బీజేపీ అధ్యక్షురాలికి పురంధేశ్వరి బాధ్యతలు స్వీకరించారు.

ఏపీ జీవనాడి అయిన పోలవరం విషయంలో కేంద్రం వెనకడుగు వేయలేదని ఆమె స్పష్టం చేశారు. ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఎప్పుడు జాప్యం చేయలేదని, ఇటీవల రూ. 12వేల కోట్లు కేంద్రం మంజూరు చేసిందని ఆమె గుర్తు చేశారు. కేంద్రం మీద అభాండాలు వేస్తున్నారని ఆమె మండిపడుతూ పోలవరం నేషనల్ ప్రాజెక్టు కాబట్టి, నిర్మాణాన్ని చేయలేకపోతే తిరిగి కేంద్రానికి ఇచ్చేయాలని జగన్ ప్రభుత్వంకు హితవు చెప్పారు.

రివర్స్‌ టెండరింగ్ చేసి అవినీతికి తావు లేకుండా చేస్తానని చెప్పి రాష్ట్రంలో ఉన్న చిన్నాచితక కాంట్రాక్టర్ల మీద మాత్రమే జగన్ ప్రతాపం చూపించారని ఆమె విమర్శించారు. కాంట్రాక్టర్లకు రూ.40-50వేల కోట్ల బకాయిలు ఉన్నాయని చెబుతూ ఇద్దరు ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని ఆమె ఆరోపించారు. బాపట్లలో 15ఏళ్ల బాలుడిని పెట్రోల్ పోసి చంపేశారని పేర్కొంటూ సొంత బాబాయిని చంపిన కేసు ఏమైందని ఆమె ప్రశ్నించారు.

దిశ యాక్ట్ తెచ్చామని ప్రజల్ని మభ్య పెట్టారని, మహిళలు ఫోన్లు ఊపినా రక్షణ లేకుండా పోయిందని, విశాఖలో ఎంపీ భార్యా, కొడుకును కిడ్నాప్‌ చేసినా రక్షణ లేకుండా పోయిందని ఆమె చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని ఆరోపించారు. ప్రత్యేక హోదాకు దీటుగా రాష్ట్రానికి చాలా మేలు కేంద్రం చేసిందన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితులపై అసహనం వ్యక్తం చేస్తూ జాతీయ రహదారులు 8623 కిలో మీటర్ల నిర్మాణాలకు రూ.1 లక్షా 15 వేల కోట్లు కేంద్రం కేటాయించిందని పురందేశ్వరి తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ రహదారులు వేసిందో సమాధానం చెప్పాలని ఆమె జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. 

రాష్ట్రంలో దశలవారీగా మద్య నిషేధం తెస్తామన్నారని, ఇప్పుడు నాణ్యత లేనిమద్యం విక్రయిస్తూ, ఇ‌ళ్లు గుల్లైనా,పుస్తెలు తెగినా ఫర్లేదన్నట్టు మద్యం అమ్మకాలు సాగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యత లేని బ్రాండ్లను విక్రయిస్తున్న సొమ్ము తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లడం లేదా అంటూ నిలదీశారు. 
మద్యం బ్రాండ్ల ద్వారా 20 శాతం ఓనర్‌కు వెళితే 80 శాతం ప్రభుత్వానికి వస్తుందని, అందులో 25 శాతం బిల్లులే లేవని ఆమె ధ్వజమెత్తారు.
మైనింగ్ వ్యాపారులపై దాడులు చేయించి తనకు అనుకూలంగా ఉన్నవారికి ఇప్పించుకుంటూ దోచుకున్నారని ఆమె ఆరోపించారు. ఇసుక లోడ్ కొనాలంటే రూ.40 వేలని చెబుతూ ఇసుక ద్వారా జరుగుతున్న అవినీతిని ఒక సంస్ధకు కేటాయిస్తూ దోచుకున్నారని ఆమె మండిపడ్డారు. ఇసుక మాఫియా రాష్ట్రంలో నడుస్తోందని ధ్వజమెత్తారు.