చంద్ర‌యాణ్‌-3 ప్ర‌తిమ‌తో శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నాలుగేళ్ల తర్వాత శుక్రవారం భూమి ఏకైక ఉపగ్రహంలో చంద్రయాన్‌ను ల్యాండ్ చేయడానికి మూడవ మిషన్‌కు సిద్ధమైంది. చంద్రయాన్-3 ప్రయోగానికి ముందు గురువారం ఉదయం తిరుమలలోని శ్రీవేంకటేశ్వర ఆలయంలో శాస్త్రవేత్తలు ప్రార్థనలు చేశారు.
 
గురువారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తల బృందం స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్‌ 3 సూక్ష్మ నమూనాతో తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరి కోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం(షార్‌) నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది.
 
ఆలయానికి చేరుకున్న శాస్త్రీయ బృందంలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. గురువారం ఉదయం ఆలయానికి చేరుకున్న వారి చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వచ్చాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారి కూడా ఆయన ఆలయానికి రాకను ధృవీకరించారు.  ప్ర‌యోగం విజయవంతం కావాల‌ని కోరుతూ ఇస్రో చీఫ్ ఎస్‌. సోమ‌నాథ్‌ తిరుమ‌ల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు.
ఆగ‌స్టు 23వ తేదీన చంద్ర‌యాన్‌-3 రోవ‌ర్‌ చంద్రుడిపై దిగుతుంద‌ని సోమ‌నాథ్‌ తెలిపారు.  అలాగే శ్రీకాళహస్తిలో స్వామిని ద‌ర్శించుకుని, ప్ర‌త్యేక పూజ‌లు చేయించారు. అలాగే చంద్రయాన్-3 విజయవంతం కావాలంటూ ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ సూళ్లూరుపేట చెంగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
రాకెట్ నమూనాను చెంగాలమ్మ అమ్మవారి ముందు ఉంచి, ప్రయోగం సాఫీగా జరగాలని ప్రార్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈసారి చంద్రయాన్ ప్రయోగం సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. రోవర్ చంద్రుడిపై ఎలాంటి అవాంతరాలు లేకుండా దిగుతుందని భావిస్తున్నామని వివరించారు.
చంద్రయాన్‌-3 ప్రయోగం అన్ని విధాలుగా విజయవంతం అవుతుందని ఇస్రో మాజీ చైర్మన్‌ జీ మాధవన్‌ నాయర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రుడి ఉపరితలంపై ఇస్రో ప్లాన్‌ చేసిన సాఫ్ట్‌ ల్యాండింగ్‌ సంక్లిష్టమైందని పేర్కొన్నారు. మిషన్‌ ఇస్రోకు ఓ మైలురాయి అని చెబుతూ నాలుగేళ్ల కిందట చంద్రయాన్‌-2 సాఫ్ట్‌ ల్యాండింగ్‌ సమయంలో ఎదురైన సమస్యలు, సవాళ్లను దృష్టిలో పెట్టుకొని ఈ సారి వ్యవస్థను పటిష్టం చేసిందని చెప్పారు. ఈ మిషన్ అన్ని విధాలుగా విజయవంతం కావాలని, తద్వారా మనం అంతరిక్ష పరిశోధనలో ఓ ముఖ్యమైన మైలురాయిని దాటగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.