వాలంటీర్ ఫిర్యాదుపై పవన్‌ పై కేసు నమోదు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై  విజయవాడ కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల వారాహి విజయ యాత్రలో వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎపిలో తీవ్ర దుమారం రేపాయి. పవన్ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ధర్నాలు చేశారు. పవన్ దిష్టి బొమ్మను దగ్ధం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయవాడ 228 సచివాలయంలో పనిచేస్తున్న అయోధ్య నగర్‌కు చెందిన దిగమంటి సురేష్ బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 405/ 2023 కింద ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారు. పవన్ కల్యాణ్ పై సెక్షన్ 153, 153A, 505(2) IPC సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది.సెక్షన్ 153 ప్రకారం పవన్ మాటల మూలంగా రెండు వర్గాల మధ్య గొడవలు జరిగి శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందంటూ కేసు నమోదైంది.

153 A కింద రెండు మతాలు, రెండు కులాల మధ్య విద్వేషాలుకు అవకాశం ఉందంటూ మరో సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 505(2) కింద తాను చెబుతున్నది వదంతి అని తెలిసినప్పటికీ కావాలని చెప్పడంతో గొడవలు జరిగే అవకాశం ఉందంటూ మరో సెక్షన్ కింద కేసు నమోదు అయ్యింది. మొత్తానికి సెక్షన్స్ అన్నీ వాడేసి మరీ కేసు దాఖలు చేశారు.

కాగా, ప్రజలను అదుపు చేయడానికే వాలంటీర్‌ వ్యవస్థను తీసుకొచ్చారని, వాలంటీర్లు సేకరించిన డేటా ఎక్కడికి వెళ్తుందని పవన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాను చెప్పేది అందరు వాలంటీర్ల గురించి కాదని స్పష్టం చేస్తూ  ప్రతి ఇంటి డేటా అంతా వాలంటీర్లకి తెలుసని తెలిపారు. ప్రభుత్వ ఉద్దేశం మరొకటి కావొచ్చు, కానీ సెన్సిటీవ్‌ ఇన్ఫర్మేషన్‌ బయటకు వెళ్తే ఎలా? అని ప్రశ్నించారు.
 
6 కోట్ల ఆంధ్రుల సమాచారం హైదరాబాద్ కు ఎందుకు పోతోందని ప్రశ్నించారు. నానాక్‌రాం గూడాలోని ఎఫ్ఓఏ ఏజెన్సీకి డేటా వెడుతున్నదని చెబుతూ అది ఎవరిదని, ఆ సంస్థలోని 700 మందికి జీతాలు ఇస్తోంది ఎవరని పవన్ ప్రశ్నించారు. సమాచారం పక్కదారి పడితే జగన్ బాధ్యత తీసుకుంటారా? అని నిలదీశారు.