గ్రీన్ ఇండియాలో భాగస్వాములవుదాం

భారత జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ  సామాజిక బాధ్యతతో  పర్యావరణ సుస్థిరత పట్ల నిబద్ధతతో పర్యావరణం, ఇంధన సంరక్షణ పట్ల  ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా కాలుష్య నియంత్రణ  కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని  చెబుతూ మనం అందరం గ్రీన్ ఇండియాలో భాగస్వాములవుదామనిని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల  కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు.

జాతీయ రహదారుల వెంబడి దేశవ్యాప్తంగా  మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి రేణిగుంట మండలం కొత్తపాలెం గ్రామ పరిధిలోని జాతీయ రహదారి వెంబడి మొక్కలు నాటి బుధవారం సాయంత్రం ప్రారంభించారు.  రేణిగుంట నుండి ఎన్ హెచ్-71లోని నాయుడుపేట వరకు 1000 మొక్కలు  నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పర్యావరణానికి హితమైన బయో ఇథనాల్ ఇంధనం వాడకం లోకి తీసుకు వస్తున్నామని చెబుతూ,  దీనివల్ల కాలుష్యం తగ్గడం, పెట్రోల్, డీజల్ ధరలు తగ్గతాయని తెలిపారు.

ప్రధానమంత్రి మోదీ ఆలోచనతో  నైపుణ్యంతో కూడిన విధానం దేశంలో జాతీయ రహదారుల ఏర్పాటు విస్తరణ జరిగిందని చెబుతూ 2014 నుంచి 2023 వరకు కేవలం 9 ఏళ్ల స్వల్ప వ్యవధిలో జాతీయ రహదారుల పొడవు దాదాపు రెట్టింపు అయిందని గడ్కరీ చెప్పారు. 
ఎన్‌హెచ్‌ఏఐ తన సామాజిక బాధ్యత కార్యక్రమాల అమలుతో, పర్యావరణ సుస్థిరత పట్ల నిబద్ధతతో పర్యావరణం, ఇంధన సంరక్షణ, ప్రత్యక్ష- పరోక్ష ఉద్గారాలను, కార్బన్ పాదముద్రలను తగ్గించడం కోసం సమర్థవంతంగా పని చేస్తున్నదని తెలిపారు. జాతీయ రోడ్డు ప్రాజెక్టులో నరికివేయబడిన ప్రతి చెట్టుకు రెట్టింపు సంఖ్యలో చెట్లను నాటడం ద్వారా పరిహారంగా పూర్తిగా పెరిగిన, పెద్ద సైజు చెట్లు విజయవంతంగా నాటడం జరుగుతున్నదని పేర్కొన్నారు.
 
ఎన్‌హెచ్‌ఏఐ  పర్యావరణ అనుకూల జాతీయ రహదారులను అభివృద్ధి చేయడానికి ప్లాంటేషన్ డ్రైవ్‌లను చేపట్టిందని చెబుతూ 2016-17 నుండి 2021-22 వరకు నాటిన మొక్కల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. వాహనాల నుంచి వెలువడే ప్రత్యక్ష కాలుష్యం తగ్గించేందుకు 2016-17 నుంచి 2021-22 వరకు దాదాపు 2.74 కోట్ల మొక్కలు నాటి, అన్ని చెట్లు, మొక్కలు ‘హరిత్ పాత్’ మొబైల్ యాప్ ద్వారా జియో-ట్యాగ్ చేయడం జరుగుతున్నదని తెలిపారు.
 
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా, ఎన్‌హెచ్‌ఏఐ భూములు, టోల్ ప్లాజాలు, అమృత్‌ సరోవర్లు సహా దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల వెంబడి 300కు పైగా ప్రాంతాల్లో మొక్కలు నాటడానికి ఈ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ప్రతి ప్రాజెక్ట్‌లో కనీసం 1000 మొక్కలు నాటి నేటి ప్లాంటేషన్ డ్రైవ్‌లో దేశవ్యాప్తంగా 3 లక్షలకు పైగా నాటనున్నామని గడ్కరీ తెలిపారు. వాతావరణ మార్పు సవాళ్లకు భారత ప్రభుత్వం ఖచ్చితమైన ప్రతిస్పందనలలో రండి మనం అందరం కలిసి చేతులు కలపండి, గ్రీన్ ఇండియాలో భాగమవుతామని పిలుపునిచ్చారు. 
 
కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల శాఖ ‘హరిత జాతీయ రహదారుల విధానం’-2015ని ప్రకటించింది. దీని ప్రకారం, ‘మొక్కలు నాటే వార్షిక కార్యాచరణ ప్రణాళిక’లో భాగంగా, 2016-17 నుంచి 2022-23 వరకు 3.46 కోట్ల మొక్కలను ఎన్‌హెచ్‌ఏఐ నాటింది. ప్రస్తుత సంవత్సరంలో 56 లక్షలకు పైగా మొక్కలు నాటాలని నిర్ణయించారు. అది ఈ వర్షాకాలం నుంచి ప్రారంభమైంది.