సంస్కృత భాషను ప్రజలందరికీ చేరువ చేయాలి

సంస్కృతంలోని ఆధునిక విషయాలను ప్రస్తుత తరానికి అందిస్తూ, సంస్కృత భాషను ప్రజలందరికీ చేరువ చేర్చేందుకు వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఛాన్స్‌లర్‌ ఎన్‌ గోపాలస్వామి పిలుపునిచ్చారు.  జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్‌ కల్చరల్‌, సాహిత్య అకాడమీ న్యూఢిల్లీ, మైసూర్‌ సాంస్కఅతి ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో మూడ్రోజులపాటు జరిగే జాతీయ సంస్కృత సమ్మేళనం బుధవారం తిరుపతి నగరంలోని సంస్కృత వర్సిటీ ఇండోర్‌ స్టేడియంలో ప్రారంభమైంది. 
 
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ సంస్కృత ప్రాచీన గ్రంథాలలో దాగివున్న నిగూఢమైన విజ్ఞానాన్ని ప్రస్తుత తరానికి అందించే విధంగా సంస్కృతాన్ని ప్రజల చెంతకు తీసుకెళ్లాలని భాషా పండితులకు, పరిశోధకులకు సూచించారు.  సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రంజన్‌ చోప్రా మాట్లాడుతూ తిరుపతిలోని స్థానిక సంస్కృత సంస్థల ద్వారా సమక్షత భాషను ప్రజలకు చక్కగా ప్రచారం చేసేందుకు, ప్రజల చెంతకు తీసుకెళ్లేందుకు ఈ సమ్మేళనాన్ని ఇక్కడ నిర్వహించామని తెలిపారు. 
 
టిటిడి కార్యనిర్వహణాధికారి ఎవి ధర్మారెడ్డి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా సంస్కృతాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ద్వారా వివిధ ఉపాధ్యాయులు ద్వారా ప్రతిరోజు ప్రసారం చేస్తున్నామని వెల్లడించారు. జాయింట్‌ సెక్రెటరీ నండూరి ఉమా, వర్సిటీ ఉపకులపతి ఆచార్య జిఎస్‌ఆర్‌ కృష్ణమూర్తి, రిజిస్ట్రార్‌ చల్లవెంకటేశ్వర్‌, సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు, వైస్‌ ప్రెసిడెంట్‌ ఆచార్య కుమ్ముదాశర్మ, డిప్యూటీ సెక్రటరీ సురేష్‌ బాబు, జాతీయ సమ్మేళనం కోఆర్డినేటర్‌ ఆచార్య కె గణపతి భట్‌, కోఆర్డినేటర్‌ డాక్టర్‌ జెబి చక్రవర్తి కూడా పాల్గొన్నారు.