15 ఏళ్లలో 41.5 కోట్ల మంది పేదరికం నుండి విముక్తి

ఐక్యరాజ్యసమితి తాజాగా నివేదిక ప్రకారం గత 15 ఏళ్లలో ఎంతమంది భారత్‌లో పేదరిక సమస్యను అధిగమించారు. ఈ 15 ఏళ్లలో 41.5 కోట్ల మంది తమ బతుకులను పేదరికం నుంచి బయట పడేసుకున్నారని తెలిపింది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యు ఎన్ డి పి), ఆక్స్‌ఫర్డ్ పేదరికం, మానవాభివృద్ధి చొరవ (ఓపీహెచ్ఐ) సంస్థలు కలిసి ప్రపంచ బహుళ డైమెన్షనల్ పేదరిక సూచిక(ఎంపీఐ)ను తాజాగా విడుదల చేశాయి. 
 
ఇందులో భారత్, చైనా, కాంగో, ఇండోనేషియా, వియత్నాం సహా 25 దేశాలు తమ పేదరికాన్ని సగం తగ్గించుకున్నాయని వెల్లడించాయి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటైన పేదరికం నిర్మూలన దిశగా తొందరగా పురోగతి సాధించగలమని ఈ గణాంకాలు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన భారతదేశంలో పేదరికం గణనీయంగా తగ్గింది. 
 
2005-06 నుంచి 2019-21 వరకు 15 ఏళ్లలో 41.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటి వచ్చారు. 2005-06 లో భారత్‌లో 55.1 శాతంగా ఉన్న పేదరికం 2019-21 నాటికి 16.4 శాతానికి తగ్గినట్లు తెలిపింది. 2005-06లో దేశంలో దాదాపు 64.5 కోట్ల మంది పేదరికంలో ఉండగా, 2015-16 నాటికి 37 కోట్లకు, 2019-21 నాటికి 23 కోట్లకు పడిపోయినట్లు పేర్కొంది. 110 దేశాల్లో ప్రజల ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు తెలిపారు.
 
2023 ఎంపీఐ లెక్కల ప్రకారం 110 దేశాల్లోని 610 కోట్ల మందిలో 110 కోట్ల మంది తీవ్ర పేదరికంలో ఉన్నారు. వారిలో 84 శాతం మంది గ్రామీణ ప్రాంత వాసులే ఉన్నారు. ఈ 110 కోట్ల మందిలో 56 కోట్ల మంది అంటే సగం జనాభా 18 ఏళ్లలోపు వారే. మొత్తం పేదల్లో ఆఫ్రికాలో 53.4 కోట్ల మంది, దక్షిణాసియాలో 38.9 కోట్ల మంది ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ దేశాల్లో పేదరిక నిర్మూలన చర్యలు అవసరమని ఐక్య రాజ్య సమితి తెలిపింది. అయితే పేదరిక తగ్గుదలపై కరోనా పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేయాల్సి ఉందని ఐరాస తెలిపింది.

ఈ 15 ఏళ్లలో భారత్‌లో ఆయా సూచికల్లో పేదల తగ్గుదల ఇలా ఉంది: పోషకాహార లేమీ సూచిలో 44.3 శాతం నుంచి 11.8 శాతానికి తగ్గింది. వంట ఇంధన సూచీలో 52.9 శాతం నుంచి 13.9 శాతానికి, పారిశుద్ధ్యం సూచీలో 50.4 శాతం నుంచి 11.3 శాతానికి, తాగునీటి సూచీలో 16.4 శాతం నుంచి 2.7 శాతానికి, విద్యుత్‌ సౌకర్య సూచీలో 29 శాతం నుంచి 2.1 శాతానికి, గృహ నిర్మాణ సూచీలో 44.9 శాతం నుంచి 13.6 శాతానికి, శిశు మరణాల సూచీలో 4.5 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గింది.

 
కాగా, ఇప్పటికి  ప్రపంచంలో అత్యాధికంగా పేదలు 22.89 కోట్ల మంది భారత దేశంలోనే ఉన్నారు. ఆ తర్వాత అత్యధికంగా నైజీరియాలో 9.67 కోట్ల మంది ఉన్నారు. భారతదేశంలో 4.2 శాతం మంది ప్రజలు తీవ్రమైన పేదరికంలో నివసిస్తున్నారు. వయోజనులలో కన్నా బాలలలో పేదరికం ఎక్కువగా ఉంటున్నది. ప్రతి ఐదు మంది బాలల్లో ఒకరు (21.8 శాతం) పేదవానిగా ఉంటున్నారు. అదే వయోజనులలో ప్రతి ఏడుగురిలో ఒక్కరు (13.9 శాతం) మంది మాత్రమే పేదలు.  భారత దేశంలో మొత్తం మీద 9.7 కోట్ల మంది పేద బాలలు ఉన్నారు.
 
పట్టణాలలోకన్నా గ్రామాలలో పేద ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నారు. పట్టణాలలో 5.5 శాతం మంది పేదలు కాగా, గ్రామాలలో 21.2 శాతం మంది ఉన్నారు.  2015-16లో తయారు చేసిన దేశంలోని అత్యత పేదరికమైన 10 రాస్త్రాల జాబితాలో కేవలం పశ్చిమ బెంగాల్ మాత్రమే ఆ జాబితా అనునది బైటకు రాగలిగినది. మిగిలిన అత్యంత పేదరిక రాస్త్రాలు: బీహార్, ఝార్ఖండ్, మేఘాలయ, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, అస్సాం, ఒడిశా, చ్చత్తిస్ ఘర్, రాజస్థాన్. గోవాలో వేగంగా పేదరికం తగ్గుతుండగా, ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్, ఆంధ్ర ప్రదేశ్, చ్ఛతిస్ ఘర్, రాజస్థాన్ లలో ఈ ధోరణి కనిపిస్తుంది.