భారీ వరదలతో నిలిచిపోయిన కేదార్ నాథ్ యాత్ర

ఉత్తరాదిని వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. ఉత్తరాఖండ్ లో కొండచరియలు విరిగిపడి 9 మంది పర్యాటకులు మృతి చెందారు. వర్షాలు, వరదల కారణంగా కేదార్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. యూపీ, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలు భారీ వర్షాలతో విలవిలలాడుతున్నాయి. 
వరద బీభత్సంతో ఆయా రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి.
ఉత్తరాఖండ్ లో కొండచరియలు విరిగిపడడంతో ప్రధాన రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేని వర్షాలు సహాయ చర్యలను కూడా అడ్డుకుంటున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ చర్యలకు సన్నద్ధమయ్యాయి. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి కారణాలతో ఉత్తరాఖండ్ లో చార్ ధామ్ యాత్రను ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిపివేశారు.
చార్ ధామ్ యాత్రికులను సోన్ ప్రయాగ, గౌరి ఖుండ్ ల వద్ద ఆపివేశారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తరాఖండ్ లో వర్షాలు, వరదలతో కొండచరియలు విరిగిపడ్తున్నాయి. కొండచరియలు విరిగిపడడంతో రాష్ట్రంలో నాలుగు ప్రధాన రహదారులు, 10 కనెక్టింగ్ రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి.
ప్రతీ సంవత్సరం వర్షాకాలంలో ఇలా కొండచరియలు విరిగిపడడం, నదులకు వరదలు రావడం జరుగుతూనే ఉంటుందని, అందుకు తాము సన్నద్ధంగా ఉన్నామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ధామి తెలిపారు. సహాయ చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సహకారం కూడా తీసుకుంటున్నామని వెల్లడించారు.
 

ప్రమాదకరంగా యమునా నది

 
మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఢిల్లీలో వరదలు పోటెత్తాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ఉప్పొంగి ప్రవహిస్తున్నది. యమునా నదిలో 206 మీటర్ల ప్రవాహ మట్టమే ప్రమాదకరం కాగా, ప్రస్తుతం ఆ నది 207.55 మీటర్ల స్థాయిలో పరుగులు తీస్తున్నది. గత 44 ఏళ్లలో యమునా నది ఇంత ఉధృతంగా ప్రవహించడం ఇదే తొలిసారి.

బుధవారం ఉదయం నుంచి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఉదయం 8 గంటల సమయంలో 207.25 మీటర్లకు చేరిన యమునా నది వరద.. మధ్యాహ్నం 12 గంటలకల్లా 207.48 మీటర్ల స్థాయికి పెరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు రికార్డు స్థాయిలో 207.55 కు చేరింది.   1978 తర్వాత యమునా నదికి ఇంత పెద్ద ఎత్తున వరద రావడం ఇదే తొలిసారి అని ఢిల్లీ వరద నియంత్రణ విభాగం చెబుతోంది.

1978లో యమునా నది వరద మట్టం 207.49 మీటర్ల స్థాయిని తాకింది. ఇప్పుడు ఆ రికార్డు కూడా బద్దలైంది.  ఇంకా వరద ఉధృతి పెరుగుతూనే ఉండటంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఢిల్లీలో వరద పరిస్థితి, ఈ పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన చర్యలపై వారితో చర్చించారు.

మరోవంక, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చిన వ‌రదలు ఆ రాష్ట్రాన్ని అత‌లాకుత‌లం చేశాయి. ప‌ర్యాట‌కుల‌కు ఆహ్లాదాన్ని ఇచ్చే ఆ ప్ర‌దేశం ఇప్పుడు ప్ర‌కృతి ప్ర‌కోపానికి కేంద్రంగా మారింది. తాజా వర్షాల‌తో బియాస్ న‌ది ఉప్పొంగిపోయింది. ఉగ్ర‌రూపం దాల్చిన ఆ న‌ది ప్ర‌వాహ ధాటికి అన్నీ కొట్టుకుపోయాయి.  కులు, మ‌నాలీ మ‌ధ్య ఉన్న మూడ‌వ నెంబ‌ర్ జాతీయ ర‌హ‌దారి కూడా ఆన‌వాళ్లు లేకుండాపోయింది. ఆ డ‌బుల్ లేన్ జాతీయ హైవే ఇప్పుడో మ‌ట్టి దిబ్బ‌లా త‌యారైంది. పూర్తిగా ధ్వంస‌మైన ఆ హైవే వీడియో ఒక‌టి ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.