సినిమా హాళ్లలో ఆహారంపై జీఎస్టీ తగ్గింపు

సినిమా హాళ్లలో తినుబండారాలపై పన్నును జీఎస్టీ మండలి తగ్గించింది.  హాల్‌ ప్రాంగణంలో విక్రయిస్తున్న తినుబండారాలు, కూల్‌ డ్రింకులపై ప్రస్తుతం విధిస్తున్న 18 శాతం పన్నును 5 శాతానికి తగ్గించింది. ఇప్పటికే రెస్టారెంట్లలో వడ్డిస్తున్న ఆహారానికి 5 శాతం జీఎస్టీ విధిస్తున్నారు.  సినిమా హాళ్లలో సర్వ్‌ చేస్తున్న ఆహారానికి, రెస్టారెంట్లలో సర్వ్‌ చేసే ఆహారానికి తేడా చూపించాల్సిన అవసరం లేదని మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ మండలి 50వ సమావేశం నిర్ణయించింది. 
 
అయితే, ప్రస్తుతం సినిమా టికెట్‌తో పాటు కాంబో ప్లాన్‌ కింద ఫుడ్‌, కూల్‌డ్రింగ్స్‌ విక్రయిస్తున్నారు. అలాంటి ఆహార విక్రయాలకు మాత్రం సినిమా టికెట్లపై విధిస్తున్న 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని జీఎస్టీ మండలి స్పష్టం చేసింది. కాగా, ఆన్‌లైన్‌ గేమ్‌లు, కాసినోలు, గుర్రప్పందాల మీద 28 శాతం  జీఎస్టీ విధించాలని జీఎస్టీ మండలి సమావేశం నిర్ణయించింది.
పందెం పూర్తి విలువ మీద ఈ పన్ను ఉంటుంది. బెట్టింగ్‌, లాటరీ తరహాలో ఆన్‌లైన్‌ గేమ్‌లు, కాసినోలు, గుర్రప్పందాల మీద కూడా 28శాతం జీఎస్టీ విధించేందుకు వీలుగా రాష్ట్రాలు తమ చట్టాలను సవరిస్తాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌ గేమ్‌ కంపెనీల ఖర్చులు పోను లాభంపై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. 
ఇక నుంచి టర్నోవర్‌ మీద పన్ను అదీ 28 శాతం విధించబోతున్నారు. వాహనాల్లో ఎస్‌యూవీ నిర్వచనాన్ని సవరించారు. ప్రస్తుతం ఒక వాహనాన్ని ఎస్‌యూవీగా గుర్తించాలంటే వాహనం పొడవు 4 మీటర్లు ఉండాలి. ఇంజిన్‌ సామర్థ్యం కనీసం 1500 సీసీ ఉండాలి. గ్రౌండ్‌ క్లియరెన్స్‌ 170 మిల్లీమీటర్లు ఉండాలి. 
 
పైగా, కారు తయారీ కంపెనీ దాన్ని ఎస్‌యూవీగా పేర్కొనాలి. కానీ ఇక నుంచి మొదటి 3 అంశాల్లో ఓకే అయితే వాహనాన్ని ఎస్‌యూవీగా పేర్కొనకున్నా పన్ను వేసే విషయంలో ఎస్‌యూవీగా గుర్తిస్తారు. అదనపు పన్ను విధిస్తారు. క్యాన్సర్‌ మందు డైనుటుక్సిమాబ్‌, అరుదైన వ్యాధుల చికిత్సలో భాగంగా అందించే ఆహారం దిగుమతి మీద జీఎస్టీని ఎత్తేస్తున్నారు. ప్రైవేటు ఆపరేటర్లు అందించే శాటిలైట్ లాంచ్ సేవలపై కూడా జిఎస్‌టిని మినహాయించారు. ఈడీ పరిధిలోకి తేవడంపై ఆందోళన

ఇలా ఉండగా, జీఎస్టీ నెట్‌వర్క్‌లోని డేటాను ఈడీ పరిధిలోకి తేవడంపై విపక్షాల ఆధ్వర్యంలో నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇది పన్ను ఉగ్రవాదం కిందకే వస్తుందని, చిన్న వ్యాపారులకు వేధింపులు తప్పవని ఢిల్లీ, పంజాబ్‌ ఆర్థిక మంత్రులు ఆతిషి మిశ్రా, సీమా హెచ్చరించారు. దీనిపై చర్చ జరగాలని వారిద్దరూ పట్టుబట్టారు. 

వారి ఆందోళనకు బెంగాల్‌, తమిళనాడు, హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, ఛత్తీ్‌సగఢ్‌, తెలంగాణ, రాజస్థాన్‌ రాష్ట్రాలు మద్దతు పలికాయి. చిన్న వ్యాపారి జీఎస్టీ కింద నమోదు చేసుకుంటే ఏనాడైనా అతనిపై ఈడీ కేసులు పెట్టే వీలుందని, రిటర్న్‌లు ఫైల్‌ చేయడం ఆలస్యం అయినా ఈడీని రంగంలోకి దింపుతారని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. 

మనీలాండరింగ్‌ చట్టం కింద కేసులు పెట్టే అవకాశం ఉందని, ఇలాంటి అధికార దుర్వినియోగాలు గతంలో చాలా చూశామని గుర్తు చేశాయి. అయితే, పీఎంఎల్‌ఏ చట్ట పరిధిలోకి జీఎస్టీఎన్‌ను చేర్చడాన్ని ప్రస్తావిస్తు వ్యాపారుల్లో ఆందోళన నెలకొందని, దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరగా ఈడీకి తాము వ్యాపారుల సమాచారం ఇవ్వబోమని కేంద్రం హామీ ఇచ్చినట్లు తెలంగాణ ఆర్ధిక మంత్రి టి. హరీశ్‌రావు తదుపరి విలేకరులకు చెప్పారు.