కేసీఆర్‌ ట్రాప్‌లో పడొద్దు .. నడ్డా హెచ్చరిక

సీఎం కేసీఆర్‌ రాజకీయ ట్రాప్‌లో పడవద్దని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర తెలంగాణలోని పార్టీ ముఖ్యనేతలకు హెచ్చరించారు. ‘‘కేసీఆర్‌తో మనకు ఎలాంటి స్నేహమూ లేదు’’ అని స్పష్టం చేశారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కిషన్‌ రెడ్డి నియమితులైన తర్వాత ఆయన అధ్యక్షతన శంషాబాద్‌లోని ఓ హోటల్‌లో పార్టీ కోర్‌కమిటీ తొలిసారి ఆదివారం రాత్రి భేటీ అయ్యింది. 

పార్టీ అంతర్గత అంశాలు, నేతల అసంతృప్తి, రాష్ట్ర కమిటీ మార్పులు, చేర్పులపైన, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపైన ఈ భేటీలో చర్చించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ మైత్రిపై కొంతమంది రాష్ట్ర బీజేపీ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్న నడ్డాను ప్రశ్నించగా బీఆర్‌ఎస్‌తో దోస్తీ లేదనే విషయాన్ని ప్రధాని మోదీ, తాను ఇప్పటికే స్పష్టం చేసినట్టు గుర్తు చేశారు. 

‘‘మనతో సఖ్యత ఉన్నట్లు ప్రజలకు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం కేసీఆర్‌ చేస్తున్నారు. ఆయన గేమ్‌ ఆడుతున్నారు. మనల్ని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు కుట్ర పన్నారు. ఇన్నాళ్లూ ఢిల్లీకి రాని రాష్ట్ర మంత్రులు ఇప్పుడే ఎందుకు వస్తున్నారు? అపాయింట్‌మెంట్‌ ఇస్తే మనతో కలిసిపోయినట్లు ప్రచారం చేస్తారు. ఇవ్వకపోతే అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదని బద్‌నాం చేస్తారు. కేసీఆర్‌ పన్నిన ఇలాంటి ఎత్తుగడలను తిప్పికొట్టాలి’’ అని పిలుపునిచ్చారు. 

‘‘ఎన్నికల మూడ్‌లోకి వచ్చాం. కలిసి పనిచేయండి. కమిటీలు వేసుకోండి. పని విభజన చేసుకోండి. ఆలస్యం చేయవద్దు. సోమవారం జరిగే రాష్ట్ర పదాధికారుల సమావేశంలోనే కార్యాచరణ సిద్ధం చేసుకోండి.’’ అని ఆయన సూచించారు. పార్టీకి వ్యతిరేకంగా బహిరంగవ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

‘‘మీడియాతో అనవసర విషయాలు మాట్లాడవద్దు. లీకుల పేరిట ఇప్పటికే పార్టీకి నష్టం చేశారు. ఇక ముందు అలా చేయవద్దు’’ అని ఆదేశించారు. తెలంగాణ బీజేపీలో నేతల మధ్య వర్గపోరు ఎక్కువైందని అంటూ  వార్తలు వస్తుండటం పట్ల నడ్డా అసహనం  అసహనం  వ్యక్తం చేశారు. నేతలు పార్టీకి నష్టం చేకూర్చేలా ప్రవర్తిస్తే సహించేది లేదని, వారిపై చర్యలు తీసుకుంటామని నడ్డా హెచ్చరించారు.

పార్టీకి నష్టాన్ని కలిగించే విధంగా అనవసర వ్యాఖ్యలు చేయవద్దని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని ఆయన హితవు చెప్పారు. ఇక నుంచి అగ్రనేతల పర్యటనలు వరుసగా ఉంటాయని, అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా నేతల పర్యటనలకు ప్లాన్ చేయాలని నడ్డా సూచించారు. పార్టీ ఇంచార్జ్‌లు ఇక నుంచి నిరంతరం అందుబాటులో ఉండాలని, పార్టీ కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా పర్య వేక్షించాలని చెప్పారు.

సౌత్ జోన్ పై వ్యూహరచన

మరో ఏడాదిలో లోక్‌సభ ఎన్నికలు ఉండటం, ఈ ఏడాదిలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో జేపీ నడ్డా సమావేశమయ్యారు. తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యాలయలంలో జరిగిన ఈ భేటీలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలపై చర్చించారు. 

సౌత్ జోన్ గా పిలుచుకునే ఈ ప్రాంతంలో గత ఎన్నికలలో బిజెపి 29 సీట్లు మాత్రమే గెలుపొందింది. ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకతో పాటు పుదుచ్చేరి, మహారాష్ట్ర, గోవా, అండమాన్‌ నికోబార్‌, లక్షద్వీప్‌ లు లు ఈ జోన్ లో ఉన్నాయి.  ఈ పర్యాయం పలు రేట్లు అధికంగా సీట్లు గెల్చుకొనే విధంగా వ్యూహరచన జరిపి, ఆ మేరకు కార్యక్రమాలు చేపట్టాలని మార్గదర్శనం చేశారు.

.సంస్థాగతంగా బలోపేతం కావడం, బూత్‌కమిటీలను పటిష్ఠం చేసుకోవడం, క్షేత్రస్థాయిలో ఐక్యకార్యాచరణ చేపట్టడం వంటి నిర్ణయాలు ఈ సమావేశంలో సౌత్‌ జోన్‌లో తీసుకున్నారు. పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని.. అందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదీ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. నిత్యం ప్రజల మధ్యకు వెళ్లి కార్యక్రమాలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడింది.

‘‘తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మిగతా రాష్ట్రాలు కూడా పార్లమెంటు ఎన్నికలకు ఇప్పట్నుంచే సంసిద్ధం కావాలి. జాతీయ నాయకత్వం మీకు అండగా ఉంటుంది. మీ రాష్ట్రాల్లోని ప్రభుత్వాల వైఫల్యాలపై పోరాటాలు చేయండి. ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేయండి’’ అని నడ్డా ఆదేశించారు.