ఢిల్లీకి భారీగా యమునా నది వరద ముప్పు

మూడు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయి  వర్షాలతో అతలాకుతలం అవుతుండగా, మరో రెండు రోజులలో  హర్యానా నుండి వచ్చే వరద నీటితో యమునా నది నుండి మరో పెద్ద వరద ముప్పు పొంచి ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు.  గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వానలకు నగరంలో యమునా నదికి వరద పోటెత్తింది. ప్రమాద ఘటనల్లో కనీసం 22 మంది చనిపోయారు. 
నదిలో వరద ప్రవాహం ప్రమాద స్థాయికి చేరింది. ఇప్పటికే రాజధానిలో కురుస్తున్న వర్షాలతో ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయాయి. వీటికి ఎగువ రాష్ట్రం నుంచి వచ్చే వరద తోడవనుంది. హర్యానాలో కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం హత్నికుండ్‌ బ్యారేజీ గేట్లను ఎత్తివేసింది.  తద్వారా లక్షా 5 వేల 453 క్యూసెక్కుల నీటిని ఆదివారం సాయంత్రం 4 గంటలకు దిగువకు విడుదల చేస్తున్నది.
ఇది రెండు రోజుల్లో ఢిల్లీని తాకనుంది. అంటే మంగళవారం మధ్యాహ్నం వరకు యమునా నది ప్రమాద స్థాయికి మించి ప్రవహించనుంది.  నగరంలోని ఓల్డ్‌ రైల్వే బ్రిడ్జి  వద్ద ప్రస్తుతం 203.18 మీటర్ల మేర వరద ప్రవహిస్తున్నదని సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ తెలిపింది. బ్రిడ్జి ప్రమాద స్థాయి 204.5 మీటర్లు అని అధికారులు తెలిపారు. హర్యానా నుంచి వచ్చే నీరు యమునా నదిలో కలిస్తే వరద ప్రవాహం 205.5 మీటర్లకు చేరుకుంటుందని చెప్పారు. 
మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంటల మధ్య యమునా నది ప్రమాద స్థాయికి మించి ప్రవహించనుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించడానికి సెంట్రల్‌ కంట్రోల్‌ రూమ్‌తోపాటు 16 కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసింది. ఆదివారం ఎడతెగని వర్షాలతో ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, జమ్ముకశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ర్టాల్లో జనజీవనం స్తంభించిపోయింది.
ఢిల్లీలో గురుగ్రామ్‌ సహా అనేక ప్రాంతాల్లో రహదారులు, అండర్‌పాసుల్లో భారీ ఎత్తున నీరు చేరి వాహనాలు కొట్టుకుపోయాయి.  17 రైళ్లను రద్దు చేస్తున్నట్టు ఉత్తర రైల్వే జోన్‌ ప్రకటించింది. మరో 12 రైళ్లను మళ్లించారు. 40 ఏండ్ల తర్వాత ఢిల్లీలో ఆదివారం ఉదయానికి 24 గంటల వ్యవధిలో రికార్డ్‌ స్థాయిలో 153 మిమీ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.
చండీగడ్‌లో 322 మిమీ, హర్యానా లోని అంబాలాలో 224.1 మి.మీ వర్షపాతం నమోదైంది. బియాస్‌ నది ఉగ్రరూపం దాల్చటంతో చండీగఢ్‌-మనాలీ జాతీయ రహదారి కొట్టుకుపోయింది. భారీ వ‌ర్షాలు కొన‌సాగే అవ‌కాశం ఉండ‌టంతో ఢిల్లీ వాసులు అప్రమ్తతంగా ఉండాల‌ని ఐఎండీ య‌ల్లో అల‌ర్ట్ జారీ చేసింది. గురుగ్రాం సైతం భారీ వ‌ర్షాల‌తో వ‌ణికింది. రోడ్లన్నీ జల‌మ‌యం కావ‌డంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఢిల్లీ లోని పార్కులు, అండర్‌పాస్‌లు, మార్కెట్లు, ఆస్పత్రి ప్రాంగణాలు, మాల్స్, నీట మునిగాయి. వీధులన్నీ జలమయమయ్యాయి. అత్యవసర సేవల విభాగాల్లో వారాంతపు సెలవులను రద్దు చేశారు. ఢిల్లీ లోని స్కూళ్లకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం శెలవు ప్రకటించారు.