కృష్ణాట్రిబ్యునల్‌ గడువు 2024 మార్చి 31వరకు పెంపు

కృష్ణా నదీ జలాల వాటాలపై అంతరాష్ట్ర వివాదాలు, ఫిర్యాదులపై వాదోపవాదనలు జరుగుతున్న నేపథ్యంలో కృష్ణా ట్రిబ్యునల్‌ గడువును కేంద్ర జలశక్తి శాఖ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ నీటి పంపకాలపై ట్రిబ్యునల్‌ ముందు వాదనలు పూర్తి చేసి తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో గడువును కేంద్ర జలశక్తి గడువు పొడిగించింది. 
 
గతంలో 1956 సెక్షన్‌ 5 సబ్‌ సెక్షన్‌ 3 అనుసరించి 1ఆగస్టు 2022 న 31 జూలై 2023 వరకు కృష్ణా ట్రిబ్యునల్‌ గడువు పెంచింది. అయితే ట్రిబ్యునల్‌ గడువు 31జూలైతో ముగుస్తున్న నేపథ్యంలో 2024 మార్చి 31 వరకు కృష్ణా ట్రిబ్యునల్‌ గడువు పెంచింది. కృష్ణా పరివాహక ప్రాంతంలో 70 శాతం ఉన్న తెలంగాణకు నీటి కేటయింపుల్లో అన్యాయం జరిగిందని తెలంగాణ నీటిపారుదల శాఖ ట్రిబ్యునల్‌ కు చేసిన ఫిర్యాదు ఇప్పటికీ పెండింగ్‌ లో ఉంది.
 
ప్రస్తుతం 66:34 చొప్పున తెలంగాణకు 299 టీఎం సీలు, ఆంధ్రకు 512 టీఎంసీల వాటాను కృష్ణా నదీ యాజమాన్యం బోర్డు చేసిన నిర్ణయాన్ని తెలంగాణ తప్పుబడుతూ రెండురాష్ట్రాలకు కేటాయించిన 811 టీఎంసీల్లో కనీసం సమాన వాటాకోసం తెలంగాణ చేసిన ఫిర్యాదుతో పాటుగా ఆంధ్ర చేసిన అభ్యంతరాలపై ట్రిబ్యునల్‌ ముందు వాదనలు కొనసాగుతున్నాయి. 
 
ప్రధానంగా పోతిరెడ్డి పాడు హెడ్‌రెగ్యూలేటర్‌ సామర్ధ్యం పెంచి 88వేల క్యూసెక్కులు ఏపీ తరలించేందుకు నిర్మిస్తున్న ప్రాజెక్టులను నిలిపివేయాలని తెలంగాణ పట్టు బిగిస్తున్న నేపథ్యంలో వాదోపవాదానలు ట్రిబ్యునల్‌ ముందు కొనసాగుతున్నాయి. ఆయితే సమస్యలను పరిష్కరించేందుకు ట్రిబ్యునల్‌ కాలపరిమితిని కేంద్ర జలశక్తి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిందనే అభిప్రాయాన్ని నీటిపారుదల శాఖ అధికారులు వ్యక్తం చేశారు.