హీరోయిన్ కాబోయి నోట్లమార్పిడిలో జైలుకు పోలీస్ ఇన్స్పెక్టర్

సినిమాలో అవకాశాల కోసం అధికార పక్ష నేతలతో స్నేహం చేస్తూ, వారి ద్వారా ఇటీవల రద్దైన రూ 2,000 నోట్ల మార్పిడిలో చిక్కుకొని విశాఖపట్టణంలోని ఓ మహిళా రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ (హోంగార్డ్స్‌) జైలుపాలయింది. సినిమాలో కూడా పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో హీరోయిన్ గా నటించబోతున్న పోస్టర్లతో సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తున్న రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలు స్వర్ణలత సహా నలుగురిని అరెస్టు చేశారు. 

పోలీసు కమిషనర్‌ త్రివిక్రమవర్మ కథనం ప్రకారం గాజువాకకు చెందిన ఇద్దరు విశ్రాంత నేవీ ఉద్యోగులు కొల్లి శ్రీను, శ్రీధర్‌లకు రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ వి.సూరిబాబు నోట్ల మార్పిడికి సంబంధించి ఆశ పెట్టాడు. రూ.90 లక్షల విలువైన రూ.500 నోట్లు ఇస్ రూ.కోటి విలువైన రూ.2వేల నోట్లు వస్తాయని, ఒక్క డీల్‌తో రూ.10 లక్షలు మిగులుతుందన్నాడు. 

ఆశపడిన వారిద్దరూ డబ్బుతో గురువారం రాత్రి సీతమ్మధారలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి వద్దకు రాగా సూరిబాబు కూడా అక్కడకు చేరుకున్నాడు. వారి వద్ద నగదు చూశాక, అదే విషయాన్ని ‘డబ్బుతో వచ్చేశారు’ అంటూ ఫోన్‌చేసి ఎవరికో చెప్పాడు. 

తర్వాత కొద్దిసేపటికే పోలీసు వాహనంలో ఇన్‌స్పెక్టర్‌ స్వర్ణలత, ఆమె వాహనం డ్రైవర్‌ కానిస్టేబుల్‌ హేమసుందర్‌(మెహర్‌), హోంగార్డు శ్రీను అక్కడకు చేరుకున్నారు. హోం గార్డు శ్రీను, వెనుక హేమసుందర్‌ దిగి సూరిబాబు బృందం వద్దకు వెళ్లారు. ఇక్కడేం చేస్తున్నారని గద్దించారు. బ్యాగులో ఏమున్నాయంటూ దానిని లాక్కుని చూశారు. 

డబ్బులు చూసి ఇవెక్కడివి? ఎలా వచ్చాయి? దేనికోసం తెచ్చారని ప్రశ్నిస్తూనే సూరిని కొట్టారు. దాంతో రిటైర్డ్‌ నేవీ ఉద్యోగులు భయపడ్డారు. వాహనంలో ఇన్‌స్పెక్టర్‌ స్వర్ణలత మేడమ్‌ ఉన్నారని, ఆమెతో మాట్లాడాలంటూ వారిద్దరినీ ఆమె దగ్గరకు తీసుకెళ్లారు. ఈ డబ్బు గురించి ఐటీ వాళ్లకు, టాస్క్‌ఫోర్స్‌కు చెబితే కేసు పెద్దదని ఆమె భయపెట్టారు.

కేసు లేకుండా ఉండాలంటే రూ.12లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. భయంతో ఆమె అడిగిన మొత్తం ఇచ్చేసి వారు వెళ్లిపోయారు. ఇంటికి చేరాక ఇదంతా సూరి, పోలీసులు ఆడిన నాటకంగా అనుమానించి మర్నాడు డీసీపీ విద్యాసాగర్‌నాయుడిని కలిసి ఫిర్యాదు చేశారు. 

అక్కడి నుంచి విచారణ ప్రారంభించామని, అన్నీ వాస్తవాలేనని తేలడంతో నిందితులను అదుపులోకి తీసుకుని మూడు కేసులు నమోదుచేసినట్లు కమిషనర్‌ తెలిపారు. ఈ కేసులో ఏ-1గా మధ్యవర్తి సూరిని, ఏ-4గా ఇన్‌స్పెక్టర్‌ స్వర్ణలతను చూపించారు. హోంగార్డు శ్రీను, డ్రైవర్‌ హేమసుందర్‌లను ఏ-2, ఏ-3లుగా పేర్కొన్నారు. 

నిందితుల నుంచి రూ.12 లక్షలు రికవరీ చేశారు. ఈ కేసులో పోలీసు సిబ్బంది ఉన్నప్పటికీ నాన్‌బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, రాజకీయ ఒత్తిళ్లు లేవని కమిషనర్‌ చెప్పారు.