పొగాకు అధికోత్పత్తిపై అపరాధ రుసుం రద్దు

పొగాకు రైతుల నుండి అనుమతించిన పంట కన్నా అధికంగా ఉత్పత్తి అయిన దానిపై వసూలు చేసే జరిమానాలు ఈ ఏడాది కేంద్రం రద్దు చేసింది. దీంతో దక్షిణాదిలోని పొగాకు రైతులకే ప్రస్తుతం ఉన్న సగటు- ధరల ప్రకారం చూస్తే రూ.22 కోట్ల మేర భారం తప్పనుంది.  పొగాకు పంట సాగు, విక్రయాలు మొత్తం ప్రక్రియ కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని పొగాకు బోర్డు పర్యవేక్షణలోనే సాగాలి.

అందువల్ల ఏటా ఏ ప్రాంతంలో ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలి, ఎంత ఉత్పత్తి చేయాలనేది బోర్డు నిర్దేశిస్తుంది. అంతకన్నా అధికంగా ఉత్పత్తి చేస్తే ఆ పంట కొనుగోలు సమయంలో అపరాధ రుసుంను బోర్డు వసూలు చేస్తోంది. తద్వారా ఉత్పత్తి నియంత్రణ చర్యలు చేపడతారు. పదేళ్ల క్రితం అలాంటి అపరాధ రుసుం ఆరోజు లభించిన ధరలో 15 శాతం తో పాటు కిలోకు రూ. 2వంతున వసూలు చేసేవారు. 

కాలక్రమంలో రైతుల వినతులపై తగ్గిస్తూ రాగా గత ఏడాది 5శాతం చార్జీలు, కిలోకు ఒక రూపాయి పెనాల్టీని వసూలు చేశారు. కర్ణాటకలో 2022-23 వ్యవసాయ సీజనులో100 మిలియన్‌ కిలోల పంట ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా 60 మిలియన్‌ కిలోలు మాత్రమే పండింది. అయితే కొందరు రైతులకు అధిక ఉత్పత్తి చేశారు. 

మొత్తంగా పంట తగ్గడంతో అధికోత్పత్తి అయినా అపరాధ రుసుంను బోర్డు రద్దు చేసింది. అదే విధంగా ప్రస్తుత సీజన్‌కు ఆంధ్రలో కూడా రద్దుచేయాలని ఇక్కడి రైతులు కోరారు. వాస్తవానికి ఆంధ్రలో అనుమతి ఇచ్చిన దాని కన్నా అధిక ఉత్పత్తి జరిగింది.  దక్షిణాదిలో 87.27 మిలియన్‌ కిలోలకు అనుమతి ఇస్తే 107.56 మిలియన్‌ కిలోలు ఉత్పత్తి అయినట్లు అంచనా.

అయితే మాండస్‌ తుఫాన్‌ వల్ల పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. మళ్లీ తోటలు వేయాల్సి వచ్చి పెట్టుబడి పెరిగింది. దీంతో అపరాధ రుసుం రద్దు చేయాలని రైతులు కోరగా పొగాకు బోర్డు అధికారులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా దక్షిణాదిలోని 11 వేలం కేంద్రాల్లో ఇప్పటికే ఆరు చోట్ల అధికారిక కొనుగోళ్లు ముగిశాయి. అపరాధ రుసుం రద్దు ఉత్తర్వుల నేపథ్యంలో అధిక పంటను సోమవారం నుంచి కొనే అవకాశం ఉంది. దక్షిణాదిలో ఇప్పటివరకు సుమారు 83.60 మిలియన్‌ కిలోల కొనుగోలు జరిగింది