బర్డ్‌లో నెలకు 25 కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలకు ప్రణాళికలు

వినికిడి లోపంతో బాధ పడుతున్న చిన్నారులకు బర్డ్‌ ఆసుపత్రిలో రాబోయే రోజుల్లో నెలకు 25 కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలు ఉచితంగా నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని టీటీడీ ఛైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలోని బర్డ్‌ ఆసుపత్రిలో శుక్రవారం కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలు చేసుకున్న పిల్లలతో ఛైర్మన్‌ మాట్లాడారు.

వినికిడి లోపంతో బాధపడుతున్నవారికి శ్రీవారి ఆశీస్సులతో కొత్త జీవితం ప్రసాదించాలనే సదాశయంతో గత ఏడాది మేలో ముఖ్యమంత్రివర్యులు శ్రీవైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి బర్డ్‌లో కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. మొదట నెలకు ఒక సర్జరీతో ప్రారంభమైన ఈ ప్రయత్నం తరువాత నెలకు మూడు దాకా చేసే స్థాయికి చేరుకుందని చెప్పారు. 

ఆ తర్వాత స్వామివారి ఆశీస్సులు, వైద్యుల కృషితో కొద్ది కాలంలోనే నెలకు 10 సర్జరీలు చేసే స్థాయికి చేరుకుందని వివరించారు. ఇందులో భాగంగానే రెండు రోజుల్లో 10 మంది పిల్లలకు సర్జరీలు చేసి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించినట్టు చెప్పారు. హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రికి చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్‌ ఈసి వినయ్‌ కుమార్‌, డాక్టర్‌ రాంబాబు నేతృత్వంలో ఈ సర్జరీలు నిర్వహించారని పేర్కొన్నారు.

రూ.7 లక్షల నుండి రూ.14 లక్షల వరకు ఖర్చయ్యే ఈ ఆపరేషన్లు ఉచితంగా నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. టీటీడీ నిర్వహిస్తున్న శ్రవణం ప్రాజెక్టులో సుమారు 120 మంది పిల్లలు కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీ కోసం పేర్లు నమోదు చేసుకున్నారని, దశలవారీగా వీరందరితో పాటు ఇతరులకు కూడా ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. 

అదేవిధంగా, గత ఏడాది మేలో ముఖ్యమంత్రి  వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి స్మైల్‌ ట్రైన్‌ సంస్థ సహకారంతో బర్డ్‌లో ఉచితంగా గ్రహణమొర్రి సర్జరీలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. ఇప్పటివరకు 48 మందికి విజయవంతంగా ఈ సర్జరీలు చేశారని, రాబోయే రోజుల్లో మరిన్ని సర్జరీలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు.