పెనుకొండ కోట నిర్మాణ శాసనాన్ని కాపాడండి

విజయనగర సామ్రాజ్యంలో ముఖ్య భూమికను పోషించిన ‘పెనుకొండ కోట’ నిర్మాణ విశేషాలను వివరిస్తున్న ప్రాచీన శాసనాన్ని కాపాడాలని చరిత్రకారుడు మైనాస్వామి భారత పురావస్తు శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు.  పెనుకొండ చరిత్రకు మూలాధారమైన శాసనాలు, కోట ఉత్తర ద్వార పరిసరాలను ఆదివారం పరిశీలించిన పిమ్మట ఆయన ఒక పత్రిక ప్రకటనను విడుదల చేశారు. 
 
విజయనగర రాజ్యం, పెనుకొండ చరిత్రరచనకు ప్రాణాధారమేగాక ప్రత్యక్ష సాక్షిగా వున్న శాసనం పగిలి పోయి వుండడం, అక్కడే చెత్త కుప్ప వుండడంతో చరిత్రకారుడు ఆవేదన వ్యక్తం చేశారు. కోట ఉత్తర ద్వార ప్రవేశం లోపలివైపున గోడ దిమ్మెపై గల ఆ శాసనానికి, కోట భాగానికి తక్షణం మరమ్మత్తులు చేయాలని భారత పురావస్తు శాఖ అధికారులను మైనాస్వామి కోరారు. 
 
ఆ మేరకు ఎ.ఎస్.ఐ. – డైరెక్టర్ జనరల్ కు లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు. హొయసల రాజ్యంలో భాగంగా వున్న పెనుకొండ సీమను మూడో వీరబల్లాల నుంచి స్వాధీనం చేసుకున్న తర్వాత మొదటి బుక్క రాయలు రాజప్రతినిధిగా నియమితులయ్యాడు. తన ప్రథమ పుత్రుడు వీర విరూపణ్ణను పెనుకొండ ప్రభువుగా బుక్కరాయలు నియమించాడు.
 
పెనుకొండ చుట్టూ అత్యంత బలిష్టమైన కోటను కట్టించడానికి క్రీ.శ 1354 మార్చిలో శ్రీకారం చుట్టారు. అనంతరసు ఒడయారు పెనుకొండ స్థల దుర్గ ప్రధానిగా వున్నట్టు శాసనం పేర్కొంటున్నదని శాసన అంశాన్ని శోధించిన మైనాస్వామి వివరించారు. ‘నమస్తుంగ శిరశ్చుంబి చంద్రచామర చారవే ‘ అని సంస్కృత శ్లోకం -శివ స్తుతి-శాసనం మొదటి వాక్యంలో వుంది. బుక్కరాయల బిరుదులు, హొయసల రాజ్య ప్రస్తావన, పెనుకొండ కోట నిర్మాణం, వీర విరూపణ్ణ తదితర విషయాలున్నాయి. 8 వాక్యాలున్న శాసనం కన్నడ భాషలో ఉన్నట్టు చరిత్రకారుడు వివరించారు.