రైతులు, రైతు కూలీల మధ్య సమన్వయం ఉండాలి

 రైతులు, రైతు కూలీల మధ్య కమ్యూనిష్టులు వర్గ సంఘర్షణ సృష్టించారని సామాజిక సమరసత జాతీయ కన్వీనర్ శ్యాం ప్రసాద్ తెలిపారు.  వ్యవసాయం సక్రమంగా జరగాలంటే రైతులు, రైతుకూలీల మధ్య బండి చక్రాల వంటి సమన్వయం వుండాలని, అప్పుడే వ్యవసాయం అభివృధ్ది చెందుతుందని ఆయన స్పష్టం చేశారు.
 
గోపాలరావు ఠాకూర్ స్మారక సమితి ఆంధ్ర ప్రదేశ్  ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన ”ఏకాత్మకా మానవతావాదమును” విజయవాడలో ఆమోదించి 58  సంవత్సరాలు పూర్తైన సందర్బంగా ఆంధ్ర ప్రదేశ్ లో భూమిలేని పేద రైతుకూలీలపై  సామాజిక ఆర్ధిక సర్వేను ఆదివారం విజయవాడలో విడుదల చేశారు.  
 
ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ ప్రసంగిస్తూ ప్రభుత్వాలు ఇచ్చే ఇల్లు పేద రైతు కూలీలకు కాకుండా పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నారని పేర్కొంటూ ఈ విధానం మారాలని హితవు చెప్పారు. మన దేశ ప్రధాని 72 గంటల పాటు సేంద్రీయ వ్యవసాయంపై చర్చ జరిపారని గుర్తు చేస్తూ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి చెయ్యాలని  వివరించారని తెలిపారు. 
 
 అలాగే సమాజంలో పారిశుధ్య కార్మికులను సన్మానించడం ద్వారా వారికి ఆత్మ గౌరవం పెరుగుతుందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా జాతీయ రైతు కూలి సంఘానికి అధ్యక్షులుగా  సాకార నాగేశ్వరరావు, కార్యదర్శిగా సప్పిడి సుబ్బరామి రెడ్డిలను నియమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్  జాతీయ రైతు కూలి సంఘం ఏర్పాటు చేయడం శుభపరిణామమని హర్షం ప్రకటించారు. తద్వారా రైతులకు రైతు కూలీలకు మద్య అనేక సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.  దేశంలో కరోనా వచ్చిన సమయంలో గ్రామాలలో వ్యవసాయం చేసే రైతులే అన్నం పెట్టి ఆదుకున్నారని ఆయన గుర్తు చేశారు. 
వ్యవసాయ భూములు రియల్ ఎస్టేట్ గా మార్చడాన్ని ఈ ప్రభుత్వాలు అడ్డుకట్ట వేయాలని ఆయన కోరారు. అలాగే ఇతర రాష్ట్రాల నుండి వచ్చి పనిచేస్తున్న కూలీలకు అన్యాయం జరగకుండా చూడాలని ఆయన చెప్పారు.  ఈ కార్యక్రమానికి వామరాజు సత్యమూర్తి ఆధ్యక్షత వహించారు.

మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ వై  ఆర్ కృష్ణారావు మాట్లాడుతూ పండిట్ దీన్ దయాళ్ నిర్వచించిన ఏకాత్మకత మనవతావాదం భిన్నమైనదని, అట్టడుగున వుండే వ్యక్తికి సైతం న్యాయం జరిగే విధంగా ఆయన ఈ సిధ్దాంతంలో వివరించారని తెలిపారు. 
నేటి సమాజంలో  రైతులకు – రైతు కూలీలకు సమన్వయం కొరవడిందని, వ్యవసాయంలో యంత్రాల వలన రైతు కూలీలు ఉపాధి కొల్పోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఉచితాలను ఇవ్వడం మానుకొని  పేదవారు వారికాళ్ళమీద నిలబడేలా ఉపాధిని కల్పించాలనిఆయన సూచించారు.  రైతు కూలీలకు లిక్కర్ షాపు, మెడికల్ షాపు, యాస్పిరేషన్ షాపుల పట్ల అవగాహన కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉపాధి హామీ పధకం నిధులు సక్రమంగా ఉపయోగిస్తన్నారో లేదో సర్వేజరగాలని ఆయన చెప్పారు.
 
సామాజిక ఉద్యమ నాయకురాలు శ్రీమతి జూపూడి హైమావతి మాట్లాడుతూ దీన్ దయాళ్ జీ  ఏకాత్మకత మానవతా వాదానికి రాజమండ్రిలో భీజం పడిందని, అక్కడ ఆయన అటల్ జీ, డాక్టర్ జీ వంటివారి సలహాలు సూచనలు తీసుకొని ప్రవచించారని తెలిపారు.
 

 విజయవాడలో ఏకాత్మకత మానవతావాదం ఆవిష్కరించిన సందర్బంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నాయకులు అడిగిన ఆనేక సందేహాలను నివృత్తి చేసారని చెప్పారు. ఏకాత్మకత మానవతావాదం అందమైన గులాబీ పువ్వులాంటిదని, అది ఎప్పుడు అనేక రేకలతో అందంగా పరిమళిస్తూ వుంటుందని ఆమె వివరించారు.

విద్యాభారతి జాతీయ అధ్యక్షులు దూసి రామ కృష్ణ మాట్లాడుతూ ఏకాత్మకతా మానవతా వాదం అతి పురాతనం, సనాతనంతో కూడిన భారతీయ మూలలతో రచించబడిందని చెప్పారు. మనిషి ముఖ్యంగా మూడు విషయాలతో సుఖంగా ఉండాలను కుంటాడని పేర్కొంటూ దుఃఖ్ఖానికి దూరంగా ఉండాలని, సమాజం ఐక్యంగా ఉండాలని, ప్రపంచం శాంతిగా ఉండాలని కోరుకంటారని వివరించారు.  ఈ సృష్టిలో మూడు ప్రపంచాలు వున్నాయని చెబుతూ చెట్ల ప్రపంచం, జంతు ప్రపంచం, మానవ ప్రపంచం అని తెలిపారు. వీటిల్లో మానవ ప్రపంచం వలనే సమస్యలు వస్తున్నాయని, ఆసమస్యల నుంచి మానవులు దూరంగా వుండాలంటే వ్యక్తిత్వ వికాసం జరగాలని ఆయన వివరించారు.


విక్రమ సింహపురి విశ్వ విద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డా. పద్మరాజు సుబ్బరామరాజు మాట్లాడుతూ రైతులు, రైతు కూలీల మద్య ఉండే సమస్యలపై రాష్టంలోని 9 జిల్లాలోని 55 మండలాల్లోని 480 గ్రామాల్లో సర్వే నిర్వహించచామని తెలిపారు.  ముఖ్యంగా రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కావాలని, ఆధునిక వ్యవసాయ పనిముట్లు సబ్సిడీలో అందించాలని, విత్తనాలు, ఎరువులు సబ్సిడీలో అందించాలని, వ్యవసాయానికి పంట రుణాలు తక్కువ వడ్డీకి అందించాలని, పండించిన పంటకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని ఆయన వివరించారు.