ఉమ్మడి పౌరస్మృతిపై మంత్రుల కమిటీ

ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘నిర్మాణాత్మక’ ముందడుగు వేసిందని అధికార వర్గాలు తెలిపాయి. పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే బిల్లుకు సంబంధించి వివిధ కోణాల్లో అధ్యయనం చేయడానికి నలుగురు కేంద్ర మంత్రులతో అనధికార కమిటీని సర్కారు నియమించింది. 
కేంద్ర మంత్రి కిరెన్‌ రిజిజు నేతృత్వంలోని ఈ కమిటీలో మంత్రులు స్మృతీ ఇరానీ, కిషన్‌రెడ్డి, అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ సభ్యులుగా ఉన్నారు.
ఉమ్మడి పౌరస్మృతిలో గిరిజన వ్యవహారాలకు సంబంధించి రిజిజు. మహిళా హక్కులపై స్మృతి, ఈశాన్య రాష్ట్రాల అంశాలపై కిషన్‌రెడి,  చట్ట, న్యాయపరమైన అంశాలపై మేఘ్వాల్‌ అధ్యయనం చేస్తారు. ఈ కమిటీ ఇప్పటికే బుధవారం సమావేశమై ప్రతిపాదిత బిల్లు విధివిధానాలు, ముసాయిదా రూపకల్పన, అమలులో తలెత్తే ఇబ్బందులపై చర్చించింది. ఈశాన్య భారతంలోని వివిధ ఆదివాసీ తెగలకు వ్యక్తిగత చట్టాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి చెందిన కొందరు ముఖ్యమంత్రులతోనూ కమిటీ సంప్రదింపులు జరిపింది. 
 
అధ్యయనం పూర్తయ్యాక త్వరలోనే తన నివేదికను ప్రధానికి సమర్పించనుంది. 2019 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో ఉమ్మడి పౌరస్మృతి అమలుకు హామీ ఇచ్చామని, ఆ దిశగా మొదటి నిర్మాణాత్మక ముందడుగు వేశామని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.  ఉమ్మడి కోడ్‌పై ప్రజాభిప్రాయం కోరుతూ లా కమిషన్‌ గత నెల 13న పబ్లిక్‌ నోటీసు జారీచేసింది. తర్వాత పది రోజులకు భోపాల్‌లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ కోడ్‌ అమల్లోకి వస్తే జాతీయ సమగ్రత, సామాజిక సామరస్యం బలోపేతమవుతాయని పేర్కొన్నారు. 
 
అప్పటి నుంచి విపక్షాలు, ముస్లిం పర్సనల్‌ లా బోర్డు, మరికొన్ని ముస్లిం వర్గాలు విరుచుకుపడుతున్నాయి. మరో పది నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగనుండగా ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే పాలక పక్షం దీనిని తెరపైకి తెచ్చిందని మండిపడుతున్నాయి. 
 
ఇంకోవైపు  ఉమ్మడి పౌరస్మృతిపై జాతీయస్థాయిలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమల్లోకి తెచ్చే ప్రక్రియ సాగుతోందని బీజేపీ తెలిపింది. త్వరలోనే అమల్లోకి వస్తుందా? అని అడుగగా ఫలితం కోసం వేచి చూడాలని ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఢిల్లీలో పేర్కొన్నారు.
 
ఉమ్మడి పౌరస్మృతిపై జూలై 3న జరిగిన పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో కాంగ్రెస్, డీఎంకే ఉమ్మడి పౌర స్మృతికి వ్యతిరేకంగా స్పష్టమైన వైఖరిని ప్రదర్శించాయి. బీఆర్ఎస్ ఎటువంటి వైఖరిని వెల్లడించలేదు. బీఎస్‌పీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, బీజేపీ దీనికి మద్దతు పలుకుతున్నాయి.  ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన స్పందిస్తూ మొదట లా కమిషన్ నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేసింది. 
 
బీజేపీ నేత, పార్లమెంటరీ ప్యానెల్ చైర్మన్ సుశీల్ కుమార్ మోదీ మాట్లాడుతూ, ఈశాన్య రాష్ట్రాలు, గిరిజన ప్రాంతాలకు దీని నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. రాజ్యాంగంలోని 6వ షెడ్యూలు, అధికరణ 371 ప్రకారం వీరికి రక్షణ ఉందని తెలిపారు. ఈ అంశంపై లీగల్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్, లెజిస్లేటివ్ డిపార్ట్‌మెంట్, లా కమిషన్ అభిప్రాయాలను ఈ ప్యానెల్ స్వీకరించింది.
 
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 19న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశాల్లో ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ప్రవేశపెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు  ఈ నెల 20 నుంచి ఆగస్టు 11 వరకు జరుగుతాయి.