కర్ణాటకను కుదిపేస్తున్న బదిలీల అవినీతి

కర్ణాటకను ‘బదిలీల’ అవినీతి (వ్యాపారం) కుదిపేస్తున్నది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో అవినీతికి పాల్పడుతున్నదని, రాజకీయ అవసరాల కోసం ఉద్యోగులను బలి తీసుకుంటున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  గురువారం అసెంబ్లీ జీరో అవర్‌లో ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్  బొమ్మై ప్రస్తావించారు.
జేడీఎస్‌ నాయకుడు కుమారస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులను సర్కారు వేధిస్తున్నదని, వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నదని లేదా బదిలీ చేస్తున్నదని విమర్శించారు. ‘బదిలీల వ్యాపారం’పై తన వద్ద సాక్ష్యాధారాలున్నాయని బుధవారం మీడియా సమావేశంలో ఆయన ఒక పెన్‌ డ్రైవ్‌ను ప్రదర్శించడం రాష్ట్రంలో సంచలనంగా మారింది.
కండక్టర్‌ జగదీశ్‌ భార్య పంచాయతీ సభ్యురాలని, దీని వల్ల అనవసరంగా జగదీశ్‌పై ఒత్తిడి తెచ్చారని తెలిపారు. గతంలో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేసిన జార్జ్‌, ఈశ్వరప్పల మాదిరి చలువరాయస్వామి కూడా బాధ్యతల నుంచి వైదొలగాలని ఆయన డిమాండ్‌ చేశారు.
కారణం  చెప్పకుండా తనను వేరే తాలుకాకు బదిలీ చేశారని ఆరోపిస్తూ గురువారం కేఎస్‌ఆర్టీసీ నగమంగళ బస్‌ డిపోలో జగదీశ్‌ అనే కేఎస్‌ఆర్టీసీ కండక్టర్‌ విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తన బదిలీకి మండ్య జిల్లాకు చెందిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చలువరాయ స్వామే కారణమని సూసైడ్‌ నోట్‌ రాశాడు.  అతడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బెంగళూరుకు తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు కాకపోవడం గమనార్హం.
 
పాఠశాల విద్యాశాఖలో నలుగురు డిప్యూటీ డైరెక్టర్లను ఈ నెల 1న బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తరువులను రద్దు చేస్తూ కొద్దీ సేపటికే మరో ఉత్తరువు జారీ చేశారని బుధవారం కుమారస్వామి వెల్లడించారు. “యతిన్ద్ర స్టేట్ టాక్స్” (వైఎస్టి)ని బదిలీ చేసిన రోజునే చెల్లించని పక్షంలో వాటిని రద్దు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి కార్యాలయంపై జేడీఎస్ తీవ్రమైన ఆరోపణలు చేసింది.
కాగా, రాష్ట్రంలోనూ మహారాష్ట్ర తరహా రాజకీయ ప్రకంపనలు రానున్నాయని, మరో మూడు నెలల్లో సిద్దరామయ్య ప్రభుత్వం కుప్పకూలనుందని బీజేపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప జోస్యం చెప్పారు. గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఉచిత గ్యారెంటీలతో రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీయడం ఖాయమని పేర్కొంటూ అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఆయన మండిపడ్డారు.
 
”రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. మహారాష్ట్రలో ఇలాంటి పరిణామాలు జరుగుతాయని ఎవరైనా ఉహించారా? బీజేపీకి మద్దతివ్వాలని అజిత్ పవార్ నిర్ణయంతో తీసుకోవడంతో కర్ణాటకలో ఏమి జరుగుతోందనని నేను భయపడుతున్నాయి. సమీప భవిష్యత్తుల్లో కర్ణాటక అజిత్ పవార్‌ ఎవరు అవుతారో, ఏమి జరుగుతుందో వేచి చూడాలి” అని  జేడీఎస్ శాసనసభా పక్షం సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి