కుటుంబ పాలన, అవినీతికి వ్యతిరేకంగానే బీజేపీ పోరాటం

కుటుంబ పాలన, అవినీతికి వ్యతిరేకంగానే బీజేపీ పోరాటం చేస్తుందని బిజెపి రాష్త్ర అధ్యక్షునిగా నియమితులైన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రెండు విషయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఎర్రకోట నుంచే స్పష్టమైన లక్ష్యాన్ని భారత ప్రజల ముందు పెట్టారని తెలిపారు. మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్‌ను పాతరేసి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని భరోసా వ్యక్తం చేశారు.  
 
రాష్ట్రంలో దేశంలో అధికారం పంచుకున్న చరిత్ర కాంగ్రెస్, బీఆర్ఎస్‌లదే అని గుర్తు చేశారు. ఈ రెండు పార్టీలు ఒకే నాణానికి బొమ్మ, బొరుసు వంటివని తెలిపారు. గత కొద్ది రోజులుగా తమపై సోషల్ మీడియాలో విష ప్రచారం జరుగుతోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. గతంలో పొత్తులు, పెట్టుకుది, ఒప్పందాలు కుదుర్చుకుంది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలేనని కిషన్ రెడ్డి చెప్పారు.
 
 కేంద్రంలో అధికారం పంచుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన వారికి కేసీఆర్ మంత్రి పదవులు ఇచ్చారని పేర్కొంటూ కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లే అని రాష్త్ర ప్రజలను హెచ్చరించారు. ఆ రెండు పార్టీల డిఎన్ఏ ఒక్కటే అని ధ్వజమెత్తారు. 
 
భవిష్యత్‌లో బీఆర్ఎస్‌తో కలసే ప్రసక్తే లేదని అంటూ వారి సహకారం తమకు అవసరం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఓడించి తీరుతామని చెబుతూ ఒక్క కుటుంబం చేతిలో తెలంగాణ బంధీ అయిందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ఎన్నో పోరాటాల తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో బందీ అయ్యిందని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నయా నిజాం తరహాలో పాలన సాగుతోందని అంటూ సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకు పాలన సాగడం లేదని విమర్శించారు. నిరంకుశ పాలనకు పాతరేయాలని ప్రజలు కంకణం కట్టుకున్నారని స్పష్టం చేశారు. కల్వకుంట్ల కుటుంబాన్ని ఫాంహౌస్‌కు పరిమితం చేయాలని పిలుపిచ్చారు.
 
ఎస్సీలకు వెన్నుపోటు పొడిచి కేసీఆర్ సీఎం అయ్యారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. గిరిజన బంధు అమలు ఏమైందో కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని చెప్పినా ఇప్పటి వరకూ అతీగతీ లేదని ధ్వజమెత్తారు. ప్రతి నియోజకవర్గ కేంద్రం, మండల కేంద్రంలో ఆస్పత్రులు నిర్మిస్తామని హామీ ఏమైందని ప్రశ్నించారు. 
 
రైతులకు రూ. లక్ష రుణమాఫీ ఏమైందో కేసీఆర్ చెప్పాలని నిలదీసేరు. పార్టీ కార్యాలయాలకు భూములు ఇస్తున్నారు కానీ.. పేదలకు ఇచ్చేందుకు మాత్రం భూములు లేవా? అని ప్రశ్నించారు. కేంద్రం సైన్స్ సిటీ ఏర్పాటు చేస్తామంటే భూమి ఇవ్వట్లేదని కిషన్ రెడ్డి తెలిపారు. ఫలక్‌నుమా వరకు నడవాల్సిన మెట్  ఎంజీబీఎస్ వద్దే ఆగిందని అంటూ పాతబస్తీకి మెట్రో లైన్ ఎందుకు నిర్మించట్లేదో కేసీఆర్ చెప్పాలని కిషన్ రెడ్డి నిలదీశారు. 
 
ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ సర్కారు పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ”దళిత ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూం ఇళ్ళు సహా.. నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారు. ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుకూలంగా బీజేపీ పరిపాలన ఉంటుంది. లక్ష్మణ్, బండి సంజయ్ నాయకత్వంలో మంచి ఫలితాలను సాంధించాం” అని తెలిపారు. ప్రజాస్వామ్య పద్దతిలో బీఆర్ఎస్‌ను పాతరేయటానికి ప్రజలు కంకణం కట్టుకున్నారని తెలిపారు.